న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలను కొనసాగిస్తారు. ఆయన సీడీఎస్‌గా 2022 సెప్టెంబరు 28న నియమితులయ్యారు. ఆయన 1981లో భారత సైన్యంలో చేరారు. ఆయన సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం లభించాయి.