న్యూఢిల్లీ, నవంబర్ 16: ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆయన మాటలు అంతా ఉత్తవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనే అందుకు కారణం. ఉచిత రేషన్ పథకం అమలును ఏడాది పొడిగించామని, అది 2023 జనవరి 1తో మొదలైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల సంబంధాల శాఖ తాజాగా ప్రకటించింది. అయితే ప్రధాని హామీకి కేంద్ర ప్రకటన విరుద్ధంగా ఉండటంతో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధాని ప్రకటన ఉత్తదేనా అని నిలదీస్తున్నాయి. ‘ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగిస్తున్నామని నవంబర్ 4న ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో అలా లేదు. అసలేం జరుగుతున్నది?’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.