PM Modi | న్యూఢిల్లీ, అక్టోబర్ 16: తమకు నచ్చని వారిని, తమ అవినీతిని, వైఫల్యాలను బయట పెట్టిన వారిపై కేంద్ర ప్రభుత్వం పగ బడుతున్నది. వారిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో అవినీతిని బయటపెట్టిన కాగ్ అధికారులపై ఇటీవల మోదీ సర్కారు బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల ఆడిటింగ్‌కు కీలకమైన ఫీల్డ్‌వర్క్‌ను ఆపేయాలని కాగ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేయగా.. తమకు రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. కాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో దేశంలో రక్తహీనత పెరిగిందన్న లాంటి వాస్తవాలను ప్రచురించినందుకు సస్పెన్షన్‌కు గురైన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) డైరెక్టర్ కే.ఎస్.జేమ్స్ బలవంతంగా రాజీనామా చేసేందుకు కేంద్రం కారణమైంది. ఆయన రాజీనామా కోసమే ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఇటీవల ఎత్తివేసి వెంటనే రాజీనామాను ఆమోదించింది. జేమ్స్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై నిజ నిర్ధారణ కమిటీ నియమించామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం.
స్వతంత్ర గొంతులకు స్థానం లేదు
మోదీ ప్రభుత్వంలో స్వతంత్ర గొంతులకు, ప్రొఫెషనల్‌గా పనిచేసేవారికి స్థానం లేదని సోమవారం కాంగ్రెస్ విమర్శించింది. ఐఐపీఎస్ డైరెక్టర్ జేమ్స్ రాజీనామాను ఆమోదించేందుకే ఆయనపై సస్పెన్షన్ ఎత్తేశారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు. తమకు భజన చేసేవాళ్లనే కేంద్రం కోరుకుంటున్నదని విమర్శించారు.