న్యూఢిల్లీ : విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2015 నుంచి 2025 వరకు ఈడీ నమోదు చేసిన కేసుల్లో పీఎంఎల్ఏ చట్టం కింద ప్రత్యేక కోర్టులు 8 కేసుల్లో మాత్రమే 15 మందికి శిక్ష విధించినట్టు కేంద్రం వెల్లడించింది. అంటే నమోదైన కేసుల్లో శిక్ష శాతం 0.1 మాత్రమే. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఈ వివరాలను తెలిపారు. ఈ పదేండ్ల కాలంలో పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ 5,892 కేసులు దర్యాప్తు చేసింది. పదేండ్ల వ్యవధిలో పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం 15 మందికి మాత్రమే శిక్ష విధించగా ఈడీ 49 కేసుల్లో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. అంటే ఈడీ చేపట్టిన 24 శాతం కేసులు మాత్రమే దర్యాప్తు దశకు చేరుకుంటున్నాయి. వాటిలో 5 శాతం కేసులు మాత్రమే విచారణ దశకు వస్తున్నాయి. ఇక 2019 నుంచి 2024 మధ్య 654 కేసులు విచారణ పూర్తి కాగా, 42 కేసుల్లో మాత్రమే శిక్ష పడ్డాయి. అంటే శిక్ష శాతం 6.42 మాత్రమే.
ఈడీపై కేంద్రం తెలిపిన వివరాలను టీఎంసీ ఎంపీ గోఖలే సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రాజకీయ మాఫియాగా ఎలా పనిచేస్తున్నదో ఈ డాటా వెల్లడిస్తున్నదని విమర్శించారు. గత పదేండ్లుగా ఈడీ నమోదు చేసిన కేసుల్లో 77 శాతం సున్నా ఆధారాల వల్ల కనీసం న్యాయస్థానంలో కూడా కేసులు దాఖలు చేయలేదని, విపక్షాలను లక్ష్యంగా చేయడానికి మోదీ ప్రభుత్వం ఈడీని వ్యక్తిగత మాఫియాగా వాడుకుంటున్నదని ఆయన విమర్శించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిసారి అండమాన్, నికోబార్ దీవుల్లో సోదాలు నిర్వహించింది. అండమాన్, నికోబార్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, దాని మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నమోదైన కేసులో ఈ సోదాలు జరిగాయి. ఆయనను జూలై 18న పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని కోర్టు ఆయనను జూలై 29న మూడు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఈడీ అధికారులు గురువారం పోర్టుబ్లెయిర్‌లో తొమ్మిది చోట్ల, కోల్‌కతాలో రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌ల అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శర్మ ప్రయోజనం కోసం 15 సంస్థలు/కంపెనీలను కొందరు ఏర్పాటు చేశారని, ఈ బ్యాంకు నుంచి రూ.200 కోట్ల మేరకు ఈ సంస్థలు/కంపెనీలు పొందాయని కేసు నమోదైంది.