Rahul Gandhi-BJP | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం ఫిర్యాదు చేసింది. వచ్చే వారం జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పనిసరిగా మందలించాలని కోరింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంపీసీ)ని ఉల్లంఘిస్తున్న రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని బీజేపీ కోరింది. గతవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై మధ్యాహ్నం ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. ‘మహారాష్ట్ర అవకాశాలను ఇతర రాష్ట్రాలు దొంగిలిస్తున్నాయని రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారు’ అని తెలిపారు.
‘బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని భావిస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు’ అని ఈసీ అధికారులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఫిర్యాదు చేశారు. ‘మహారాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆపిల్ ఐ-ఫోన్లు, బోయింగ్ విమానాలను ఇతర రాష్ట్రాల్లో తయారు చేస్తున్నారని ధృవీకరించని ప్రకటనలు చేస్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మహారాష్ట్ర ముందు ఉంటుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య రూ.70,795 కోట్ల ఎఫ్డీఐ నిధులు వచ్చాయని బీజేపీ నేతలు చెప్పారు. అబద్ధాలు చెప్పొద్దని నోటీసులు జారీ చేసినా రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకోలేదన్నారు. యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు.