Narendra Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : పాకిస్థాన్‌పై భారత్ పైచేయి సాధించినప్పటికీ, ‘కాల్పుల విరమణ’పై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలుపడం యావత్ జాతి జనులను విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, రక్షణ రంగ నిపుణులు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా ప్రతీ ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆత్మరక్షణలో పడిన ప్రధాని మోదీ డ్యామేజీ కంట్రోల్‌కు దిగడంతో పాటు ఇమేజ్ మేకోవర్‌కు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అర్థమవుతున్నది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించడం, ఆ మరుసటి రోజే పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం పేరిట పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించిన మోదీ ప్రభుత్వం అర్ధాంతరంగా ‘కాల్పుల విరమణ’కు అంగీకరించడాన్ని దేశంలోని అన్ని వర్గాలు ఖండించాయి. భారత్-పాక్‌కు సంబంధించిన ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవడం ఏమిటని నిలదీశాయి. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నాయకులు, బుద్ధిజీవులు ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకొన్న కాల్పుల విరమణ నిర్ణయాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించబోదని జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానీ ధ్వజమెత్తారు. ‘కాల్పుల విరమణ’పై అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్ వంటి సంక్లిష్ట దేశానికి ప్రధానిగా వ్యవహరించే వ్యక్తి బాగా చదువుకున్న వాడై ఉండాలంటూ సొంత పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మోదీని పరోక్షంగా టార్గెట్ చేశారు. సార్వభౌమాధికారంపై రాజీపడి మోదీ సర్కారు ట్రంప్‌నకు అమ్ముడుపోయిందా? అంటూ శివసేన ధ్వజమెత్తింది. యుద్ధ వాతావరణం సృష్టించి, మధ్యలో కాడి వదిలేస్తూ 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటలు ఆడటమేంటని భోజ్‌పురి సింగర్ నేహాసింగ్ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘కాల్పుల విరమణ’పై తనను తానే మోదీ అపహాస్యం చేసుకొన్నారని కార్టూనిస్ట్ మంజుల్ ధ్వజమెత్తారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షాన్ని ఎందుకు అనుమతించాల్సి వచ్చిందో చెప్పాలని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికాకు మోదీ అవకాశం కల్పించడం అతిపెద్ద దౌత్య వైఫల్యమని రాజకీయ విశ్లేషకుడు తన్మయ్ ఘోష్ విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒత్తిడితో మోదీ కాల్పుల విరమణకు రాజీపడటం అవమానకరమని రక్షణ రంగ నిపుణుడు సుశాంత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
‘కాల్పుల విరమణ’పై ఆగ్రహంతో ఉన్న వారిని తన ప్రసంగంతో దారికి తెచ్చుకోవాలని ప్రధాని మోదీ ఎంతో ప్రయత్నించారు. భావోద్వేగపూరిత సంభాషణలతో స్పీచ్‌ను కొనసాగించారు. అయితే, ప్రజలు, మేధావులు మోదీ నోటివెంట వినాలనుకొన్నది సెంటిమెంట్ స్పీచ్ కాదు. ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని ఎందుకు, ఏ పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చిందన్న దానిపైనే అందరి ఆసక్తి నెలకొంది. అయితే, తన ప్రసంగంలో ఆ విషయాన్నే మోదీ దాటవేశారు. ‘ట్రంప్ వాణిజ్య బెదిరింపుల వ్యాఖ్యల’పై కూడా ఆయన స్పందించలేదు. దీంతో మోదీ వైఖరిపై అందరూ మండిపడ్డారు. ప్రసంగం నిస్తేజంగా ఓ ప్రహసనంలా సాగిందని ధ్వజమెత్తారు. జాతినుద్దేశించి మాట్లాడటం పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదని, బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకోలేరని ప్రముఖ జర్నలిస్ట్ రాజు పార్లేకర్ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. ‘ట్రంప్ వాణిజ్య వ్యాఖ్యల’పై తన ప్రసంగంలో ఒక్కమాట కూడా ప్రధాని ఎత్తలేదు. అయితే, ప్రసంగం అయ్యాక.. అమెరికాతో చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ మొక్కుబడి ప్రకటనను విడుదల చేశాయి. దీంతో నెటిజన్లు మరింతగా మండిపడ్డారు. మొత్తంగా తన ప్రసంగం కూడా ప్రభావం చూపలేదని గ్రహించిన ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. పనిలోపనిగా సైనికుల్లో ధైర్యాన్ని నింపేలా ప్రసంగించారు. భారత ఆడపడుచుల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశామంటూ మాట్లాడారు. భారత్‌ను, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకొంటామన్నారు.
జవాన్లతో మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పహల్గాం మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను, వారిని ఎగదోసిన పాక్‌ను విడిచిపెట్టడమేనా మీరు చెప్తున్న ఆ పెద్ద నిర్ణయం’ అంటూ నెటిజన్లు మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. యుద్ధానికి ముందు లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు నాయకుడు అనే వాడు సైన్యంలో ధైర్యాన్ని నూరిపోయడం చూశాంగానీ, యుద్ధం పూర్తయ్యాక వెళ్లడమేంటని మోదీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. మొత్తంగా ‘కాల్పుల విరమణ’ ప్రకటన, దాని తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ఆత్మరక్షణలో పడి ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తన ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రభుత్వాన్ని అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షం నిలదీస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం వెల్లడించారు. కాల్పుల విరమణతోసహా భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తలలో తాజా పరిణామాలను చర్చించేందుకు వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ‘అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించినపుడు అసలు వాస్తవాలేంటి, ఏం జరిగింది, వంటి అంశాలన్నీ అడుగుతాం’ అని ఖర్గే చెప్పారు.
‘యుద్ధాల యుగం కాదు’ అంటూ ప్రధాని మోదీ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ‘కాల్పుల విరమణ’ ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది?, ‘ట్రంప్ జోక్యం’ ఎందుకు అనుమతించారు? అనే కీలక విషయాలను ప్రధాని విస్మరించడంతో ఆయన ప్రసంగంపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. దీన్ని ధ్రువపరుస్తూ.. లైవ్ స్ట్రీమింగ్, యూట్యూబ్, ఎఫ్బీ, ఎక్స్ లైవ్ వీడియోల్లో వ్యూయర్షిప్ భారీగా తగ్గినట్టు పలువురు చెప్తున్నారు. కాగా, ‘కాల్పుల విరమణ’లో బీజేపీ వైఖరిని ఎన్డీయేలోని టీడీపీ వంటి మిత్రపక్షాల సోషల్‌మీడియా విభాగాలు తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
రక్షణ రంగ, రాజకీయ, మేధోవర్గాల నుంచే కాదు సోషల్‌మీడియాలో కూడా ‘కాల్పుల విరమణ’ నిర్ణయంపై నెటిజన్లు మోదీ సర్కారుపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇంతలో ‘మాదే విజయమ’ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొంటూ సంబురాలు చేసుకొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఇంటా బయటా ముప్పేట దాడి పెరుగుతుండటం, ఇంతలోనే ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని పక్కనబెట్టి సరిహద్దుల్లో పాక్ మళ్లీ డ్రోన్ల దాడులతో కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. డ్యామేజీ కంట్రోల్ చేసుకోకుంటే పరిస్థితి చేజారే ప్రమాదమున్నదని గ్రహించిన ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే, అంతకు ముందే లైన్‌లోని వచ్చిన ట్రంప్.. వాణిజ్యం ఆపేస్తానని బెదిరించడంతోనే భారత్-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకొన్నాయని బాంబు పేల్చారు. దీంతో మోదీ సర్కారు తీవ్ర ఇరకాటంలో పడింది.