CBI – NEET |ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం కేసు నమోదు చేసింది. గత నెల ఐదో తేదీన రాసిన నీట్ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. నీట్ నిర్వహణలో అవకతవకలపై విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసింది సీబీఐ.
నీట్ పరీక్ష నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగించింది. మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యా్ప్తునకు ఆదేశించాలని పది మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నీట్ యూజీ 2024 పరీక్ష పత్రం లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై సీబీఐ కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.