NEET paper leak : నీట్ యూజీ – 2026 (NEET UG-2026) పరీక్ష పేపర్ లీక్ (Paper leak) ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని గురువారం ఢిల్లీ (Delhi) లోని రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో హాజరుపరిచారు.
నీట్ పేపర్ లీక్ ఘటనపై గత మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దూకుడు పెంచి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నాసిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్, జైపూర్ (రాజస్థాన్) కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్, వికాస్ బివాల్, గురుగ్రామ్ (హరియాణా) కు చెందిన యశ్ యాదవ్‌లను అరెస్టు చేశారు. ఈ కేసులో సంబంధిత ఇతర వ్యక్తులపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సీబీఐ అధికారులు.
ఈ ఘటనను మల్టీస్టేట్ నెట్‌వర్క్‌గా భావిస్తున్న సీబీఐ.. కేసును ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. విద్యార్థులు, పాఠశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి వచ్చే సమాచారం సేకరించడం, వెబ్సైట్లు, సోషల్ మీడియా లింక్‌లను పరిశీలించడం తదితర మార్గాల ద్వారా లీక్ వ్యవస్థ పూర్వాపరాలను కనుగొనేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.