న్యూఢిల్లీ, విజయవాడ, ఫిబ్రవరి 2: సీబీఐ శనివారం దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో లంచాల బాగోతం బయట పడటం సంచలనం సృష్టించింది. లంచాల విషయమై అందిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ, విశాఖపట్నం నుంచి వచ్చిన సీబీఐ అధికారులు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ పరిపాలన భవనం, వడ్డేశ్వరంలోని వర్సిటీ క్యాంపస్లో రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయానికి న్యాక్ నుంచి ‘ఎ++’ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి వర్సిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చినట్టు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. తనిఖీల్లో రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ఐ ఫోన్ 16 ప్రోను సీబీఐ స్వాధీనం చేసుకుంది. వీటిని లంచాలుగా ఇచ్చారని సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యాజమాన్య ప్రతినిధులు ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే లంచాలు స్వీకరించిన న్యాక్ తనిఖీ బృందం ఛైర్మన్, సభ్యులుగా ఉన్న ప్రముఖ వర్సిటీల ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకుంది. మరోవైపు చెన్నై, బెంగళూరు, భోపాల్, బిలాస్పూర్, న్యూఢిల్లీ, గౌతమ్ బుద్ధ్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ సీబీఐ తనిఖీలు చేపట్టింది.