భోపాల్: అత్యాచార బాధితురాలైన బాలికను పిల్లల సంక్షేమ అధికారులు నిందితుడి ఇంటికి పంపారు. (Rape Survivor Sent To Accused’s Home) దీంతో ఆ వ్యక్తి ఆమెపై మళ్లీ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రావడంతో అధికారులతో సహా పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరి 16న పన్నా జిల్లాలోని గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక స్కూల్‌కు వెళ్లిన తర్వాత అదృశ్యమైంది. ఆమె కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 17న హర్యానాలోని గురుగ్రామ్‌లో మరో గ్రామానికి చెందిన నిందితుడి వద్ద ఉన్న ఆ బాలికను గుర్తించి జిల్లాకు తీసుకొచ్చారు. ఆ వ్యక్తి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది.
కాగా, నిందితుడైన వ్యక్తిపై పోక్సో చట్టంతోపాటు కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధిత బాలికను పునరావాసం కోసం పన్నా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచారు. తొలుత పన్నాలోని వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ)లో ఆమెను ఉంచారు. అయితే బాలల సంక్షేమ నిబంధనలను సీడబ్ల్యూసీ అధికారులు ఉల్లంఘించారు. నిందితుడి వదిన ఇంటికి ఆమెను పంపారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఆ బాలికపై మళ్లీ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు తిరిగి జైలుకెళ్లాడు.
మరోవైపు సీడబ్ల్యూసీ అధికారులు బాధితురాలిని నిందితుడి ఇంటికి పంపడాన్ని ఆమె కుటుంబం తప్పుపట్టింది. పన్నా కలెక్టరేట్ పబ్లిక్ హియరింగ్‌లో దీని గురించి ఫిర్యాదు చేశారు. బాలికను తమకు అప్పగించాలని కోరారు. జిల్లా కలెక్టర్ జోక్యంతో దీనిపై దర్యాప్తు చేశారు. తమ తప్పును కప్పిపుచ్చడానికి సీడబ్ల్యూసీ అధికారులు ప్రయత్నించారు. ఏప్రిల్ 29న ఆ బాలికను తిరిగి ఓఎస్సీకి తరలించారు.
కాగా, అక్కడ కౌన్సెలింగ్ సందర్భంగా నిందితుడు మళ్లీ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. మీడియా ద్వారా ఇది బయటకు వచ్చింది. దీంతో పన్నా కొత్వాలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును ఛత్తర్పూర్ జిల్లాలోని జుజార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అత్యాచార బాధితురాలిని నిందితుడి ఇంటికి పంపాలనే తప్పుడు నిర్ణయం తీసుకోవడం, దానిని దాచిపెట్టిన నేరం కింద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), చైర్మన్ అయిన అధికారిణి, సభ్యులతో సహా పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Indian Wins Rs 35 Crore Jackpot | యూఏఈలో.. రూ.35 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు
MP Judge Gets Rs 5 Billion Threat | బతకాలంటే ఐదు బిలియన్లు ఇవ్వు.. జడ్జీకి బెదిరింపు లేఖ
Kukis agree to reopen NH-2 | జాతీయ రహదారి 2ను తెరిచేందుకు కుకీలు అంగీకారం.. మణిపూర్‌లో శాంతికి ఊతం
Watch: దూకాలని సవాల్ చేసిన భర్త.. మేడ పైనుంచి కిందకు దూకిన భార్య