బెంగళూరు: సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసిన ఐటీ ఇంజినీర్ రూ.87 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ డేటా చోరీ చేశాడు. సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్‌ను దొంగిలించాడు. ఈ నేపథ్యంలో ఆ టెకీని ఉద్యోగం నుంచి ఆ కంపెనీ తొలగించింది. ఆ తర్వాత ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Stealing Software Data) దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. అమేడియస్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఇండియా (పి) లిమిటెడ్ కంపెనీలో 2020 ఫిబ్రవరి 1 నుంచి ఆశుతోష్ నిగమ్ సీనియర్ మేనేజర్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
కాగా, 2025 అక్టోబర్ 11న ఆశుతోష్ నిగమ్ కంపెనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌తో పాటు సోర్స్ కోడ్‌ను వ్యక్తిగత ఇమెయిల్ ఖాతా నుంచి బయటకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆ సంస్థ ఆరోపించింది. అంతర్గత దర్యాప్తు, ఫుటేజ్, నివేదికలతో అతడ్ని నిలదీయగా సోర్స్ కోడ్‌ను దొంగిలించినట్లు అంగీకరించాడని తెలిసింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 3న ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొంది.
మరోవైపు టెకీ ఆశుతోష్ నిగమ్ చోరీ చేసిన సాఫ్ట్వేర్, సోర్స్ కోడ్ విలువ 8,000,000 యూరోలు (సుమారు రూ.87 కోట్లు) అని ఆ ఐటీ సంస్థ తెలిపింది. దీని వల్ల కంపెనీ మేధో సంపత్తి హక్కులకు భంగం కలగడమే కాకుండా, కంపెనీకి తీవ్రమైన వ్యాపార నష్టం, హాని జరిగినట్లు ఆరోపించింది. జనవరి 23న వైట్‌ఫీల్డ్ సీఈఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆశుతోష్ నిగమ్‌పై ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే