న్యూఢిల్లీ, జూన్ 13 : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్న సందర్భంగా దేశంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను రద్దు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ విమానాల అదనపు తనిఖీకి డీజీసీఏ శుక్రవారం ఎయిరిండియాను ఆదేశించిన నేపథ్యంలో వీటిని తాత్కాలికంగా నిలపివేసే అంశం పరిశీలనలోకి వచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఎయిరిండియా వద్ద 26 బోయింగ్ 787-8 విమానాలు, 7 787-9 విమానాలు ఉన్నాయి.
ఇలా ఉండగా వచ్చే వారం పారిస్‌లో జరిగే ఎయిర్ షో పర్యటనను బోయింగ్ చీఫ్ ఎగ్జక్యూటివ్ కెల్లీ ఆర్థెర్గ్ రద్దు చేసుకున్నారు. డ్రీమ్‌లైనర్ కూలిపోయిన ఘటనకు సంబంధించిన దర్యాప్తుపై దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. బోయింగ్ సంస్థ తయారుచేసే విమానాల భద్రత, నాణ్యతపై ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న భారత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు కూడా బోయింగ్ సహకరిస్తోందని కెల్లీ ఆర్థెర్గ్ తెలిపారు.