Union Cabinet | రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి పథకం కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్సీడీసీ (NCDC) రూ.20వేల కోట్లు సేకరిస్తుందని.. ఈ నిధులను కొత్త ప్రాజెక్టులు, పాంట్ల విస్తరణ, సహకార సంస్థలకు రుణాలు ఇవ్వడం, మూలధన అవసరాలను తీర్చేందుకు రుణాలు అందించేందుకు వినియోగిస్తుందని తెలిపారు. దీంతో 13,288 సహకార సంఘాల్లోని 2.9 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ, పశువులు, మత్స్య సంపద, చక్కెర, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి వివిధ రంగాలలో కార్మికులతో పాటు మహిళల నేతృత్వంలో సహకార సంస్థలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఇటార్సి-నాగ్‌పూర్ నాల్గో రైల్వేలైన్‌పై ఆయన అప్డేట్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం ఇటార్సీ, నాగ్‌పూర్ మధ్య నాలుగో లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఢిల్లీ-చెన్నైతో పాటు ముంబయి-హౌరాను కలిపే కారిడార్‌లో నిర్మించనుండగా.. ఇది నాలుగు దిశలను కలిపే స్థానం అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.