Union Cabinet : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తీపి కబురు అని చెప్పవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్ (Kharif Season) కోసం పంటల కనీస మద్దతు ధర (MSP) పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.
రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించారు. సాధారణ వరి రకానికి కనీస మద్దతు ధరను రూ.2,441 గా ఖరారు చేశారు. నాణ్యమైన గ్రేడ్-ఏ రకం వరికి మద్దతు ధరను రూ.2,461 గా నిర్ణయించారు. రాబోయే ఖరీఫ్ పంటల మద్దతు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
క్వింటాల్ పొద్దుతిరుగుడు మద్దతు ధరను రూ.622 పెంచి రూ.8,343 గా నిర్ణయించారు. అదేవిధంగా క్వింటాల్ పత్తిపై రూ.557 పెంచి రూ.8,267 మద్దతు ధరగా ప్రకటించారు. క్వింటాల్ నువ్వుల మద్దతు ధరను రూ.500 పెంచి రూ.10,052 గా నిర్ణయించింది. అదేవిధంగా క్వింటాల్ సజ్జల మద్ధతు ధర రూ.2,900గా, క్వింటాల్ రాగుల మద్దతు ధర రూ.5,205గా, క్వింటాల్ మక్కజొన్న మద్దతు ధర రూ.2,410 గా, క్వింటాల్ కందుల మద్దతు ధర రూ.8,450 గా, క్వింటాల్ పెసర్ల మద్దతు ధర రూ.8,780గా, క్వింటాల్ మినుముల మద్దతు ధర రూ.7,800 గా, క్వింటాల్ పల్లీల మద్దతు ధర రూ.7,263గా కేంద్రం ప్రకటించింది.