Amit Shah | సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. పలువురు ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు.
సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని (CAA will never be taken back) స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం మాత్రం విభజన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్న ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినదని షా వెల్లడించారు. ఇదే సందర్భంలో విపక్షాలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు ఏ పనీ లేదని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా..? అని షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయని అమిత్ షా మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అన్నారు. వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని, మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయడం అసాధ్యమని షా పేర్కొన్నారు.
భారత పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు చేస్తున్న వాదనలో వాస్తవం లేదన్నారు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదని వెల్లడించారు. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అందుబాటులోకి తెచ్చింది.
Also Read..
Tik Tok | అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
Harry Brook | మా కుటుంబంలో విషాదం.. అందుకనే ఐపీఎల్ ఆడొద్దనుకున్నా
Taapsee Pannu | అతనిది గొప్ప వ్యక్తిత్వం.. అందుకే ప్రేమించా: తాప్సీ