కోల్‌కతా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్‌ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు. ఆ దేశంలోకి తీసుకెళ్లి బంధించారు. ఇరు దేశాల సైనిక అధికారుల సమావేశం తర్వాత బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించారు. (BSF Jawan Kidnapped) పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున సుతియార్లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శిబిరం సమీపంలోని చాందిని చౌక్ ప్రాంతంలో బంగ్లాదేశీల చొరబాటును ఒక జవాన్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లోని చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు బీఎస్ఎఫ్ జవాన్‌ను కిడ్నాప్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోకి తీసుకెళ్లి అరటి చెట్టుకు కట్టేసి బంధించారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే బీఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) అధికారులను సంప్రదించారు. ఫ్లాగ్ మీటింగ్ తర్వాత రెండు గంటల్లోనే ఆ జవాన్‌ను అప్పగించినట్లు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో భద్రతా ప్రోటోకాల్‌ను బీఎస్ఎఫ్ సమీక్షిస్తున్నదని వెల్లడించారు.
Also Read: