న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో చొరబాటుదారులను నిరోధించడానికి పాములు, మొసళ్లను వినియోగించాలని సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) వర్గాలు యోచిస్తున్నాయి. నదీతీర, చిత్తడి నేలల్లో చొరబాట్లను నిరోధించడానికి ఒక సహజ నిరోధంగా వీటిని వినియోగించాలని ఈ యోచన చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో సంప్రదాయ ఫెన్సింగ్ వేయడానికి వీలుకాకుండా బలహీనమైన ప్రదేశాలు ఉన్నచోట వీటిని ఉంచాలని భావిస్తున్నారు. కాగా, 4,096 కి.మీ పొడవున ఉన్న సరిహద్దులో 175 కి.మీలు నదీతీర, చిత్తడి నేల ప్రాంతాలు ఉన్నాయి.
ఇక్కడ భౌతికపరమైన అడ్డంకులు ఏర్పాటు చేయడం వల్ల స్మగ్లింగ్, ఇతర అక్రమ కార్యకలాపాలు, చొరబాట్లను నిరోధించడం చాలా కష్టతరం. కాగా, కొత్త ప్రణాళికకు అనుకూలంగా ఉన్న నదీతీర ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని బీఎస్ఎఫ్ను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఈ ప్రణాళిక ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, భవిష్యత్లో దీనిని అమలు చేస్తారో లేదో తెలియదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. కాగా, అదే సమయంలో డ్రోన్లు, సెన్సార్లు, కెమెరాలు, ఇతర రక్షణ వ్యవస్థలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసినట్టు ఆయన చెప్పారు.