దక్షిణాది రాష్ర్టాలు దేశ జీడీపీలో 36 శాతం సహకారం అందిస్తున్నా, కేవలం 19 శాతం జనాభానే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి పార్లమెంట్లో 36 శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలి. రాష్ర్టాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలి.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆదర్శవంతమైన సమాఖ్య రాష్ర్టాల దేశంలో ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవకూడదు. ఇది నియంతృత్వానికి దారితీయకూడదు’ అని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ర్టాల భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఇది పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిధుల కేంద్రీకరణతోపాటు ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
భారతదేశం ప్రజాస్వామిక దేశమైనా, భిన్న అస్తిత్వాలు, సంస్కృతులతో కూడిన సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దక్షిణాది రాష్ర్టాలు దశాబ్దాలుగా కేంద్రం నుంచి వివక్షను ఎదురొంటున్నాయని, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రతిపాదనలతో పార్లమెంట్ ప్రాతినిధ్యంతోపాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. చెన్నైలో శనివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల పార్టీల నేతలు, ముఖ్యమంత్రుల స మావేశంలో పాల్గొన్న కేటీఆర్.. తన ప్రసంగం అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ర్టాలకు జరిగే నష్టాన్ని వివరించారు. దక్షిణాది ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ విధానాలను బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వాలతో సంబంధాలను పెంపొందించి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేపడుతున్నట్టయితే, రాష్ర్టాల మధ్య విభేదాలు సృష్టించే ఈ విధానానికి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ తరఫున కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. జనాభా ఆధారంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచితే పరిపాలన ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని, అందుకే పార్లమెంట్ స్థానాలను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. లేదంటే, అన్ని రాష్ర్టాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం లేదా రాష్ర్టాలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సీట్ల విభజన చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఐదు దశాబ్దాలపాటు జనాభా ఆధారంగా సీట్ల పెంపును నిలిపివేసి, ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణలో విజయం సాధించిన తర్వాత అదే సూత్రం ఆధారంగా డీలిమిటేషన్ చేయడం అన్యాయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దక్షిణాది రాష్ర్టాలు దేశ జీడీపీలో 36% సహకారం అందిస్తున్నా, కేవలం 19% జనాభా కలిగి ఉన్నాయని, అందువల్ల పార్లమెంట్లో 36% ప్రాతినిధ్యం ఇవ్వాలని విప్లవాత్మక సూచన చేశారు. జనాభాతోపాటు ఆర్థిక, పరిపాలన అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం సూపర్ పవర్‌గా మారాలంటే ఈ బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ర్టాలకు అనేక నష్టాలు కలుగుతాయని కేటీఆర్ హెచ్చరించారు. దేశ అభివృద్ధిలో ముందున్న రాష్ర్టాలు నష్టపోతుండగా, వెనుకబడిన రాష్ర్టాలకు లాభం కలుగుతుందని విమర్శించారు. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ర్టాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నా, ఈ విధానంతో తీవ్ర నష్టాన్ని ఎదురొంటున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం వివక్ష కొత్తేమీ కాదని, మోదీ ప్రధాని అయ్యాక ఇది మరింత పెరిగిందని ఫైరయ్యారు. ప్రస్తుత బీజేపీ సారథ్యంలోని కేంద్రం డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తెచ్చి ఈ వివక్షను తీవ్రం చేస్తున్నదని విమర్శించారు. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాది రాష్ర్టాలకే పరిమితమవడం ఇందుకు ఉదాహరణగా చెప్పారు.
పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ర్టాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నా, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో తీవ్ర నష్టాన్ని ఎదురొంటయి. దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం వివక్ష కొత్తేమీ కాదు. మోదీ ప్రధాని అయ్యాక ఇది మరింత పెరిగింది. ప్రస్తుత బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశాన్ని ముందుకుతెచ్చి ఈ వివక్షను మరింత తీవ్రం చేస్తున్నది. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాది రాష్ర్టాలకే పరిమితమవడం ఇందుకు ఉదాహరణ.
-కేటీఆర్
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గడానికే పరిమితం కాదని, ఆర్థిక నిధుల కేటాయింపుల్లో కూడా నష్టం కలుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రక్రియతో అధికారం కేంద్రీకృతమై, నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నదని, నాలుగైదు రాష్ర్టాలే దేశ భవిష్యత్తును నిర్దేశించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక వనరుల కేంద్రీకరణతో దక్షిణాది రాష్ర్టాలకు జరుగుతున్న నిధుల కేటాయింపుల్లో అన్యాయం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆదర్శవంతమైన సమాఖ్య రాష్ర్టాల దేశంలో ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ మండిపడ్డారు. ‘సమాఖ్యత కేంద్రం ఇచ్చేది కాదు.. రాష్ర్టాల హకు. అందుకే మా ప్రయోజనాల కోసం పోరాడుతాం’ అని స్పష్టం చేశారు. ఈ సమస్య కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల వ్యవహారం కాదని, జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మనమంతా భారతీయులం. అయితే, ఆయా ప్రాంతాల అస్తిత్వం, విభిన్న భాషలు, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన సమైక్య దేశమన్న విషయాన్ని మర్చిపోకూడదు’ అని పేర్కొన్నారు. వెనుకబడిన రాష్ర్టాలకు నిధులివ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ నిధుల కేటాయింపుల్లో వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. 1971 తర్వాత జనాభా నియంత్రణ చేపట్టిన దక్షిణాది రాష్ర్టాలు ఈ రోజు నష్టపోవడం అన్యాయమని, ఉత్తరాది రాష్ర్టాలు జనాభా నియంత్రణలో విఫలమైనందున వాటికి లబ్ధి చేకూర్చడం సరికాదని, ఇది దేశాన్ని వెనుకకు నడిపినవారికి బహుమతి ఇవ్వడమేనన్నారు.
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి సూపర్ పవర్ కావాలంటే, అభివృద్ధి సాధించిన రాష్ర్టాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. కానీ శిక్ష కాదు’ అని కేటీఆర్ హితవుపలికారు. డీలిమిటేషన్ ఆర్థిక, పరిపాలన, అభివృద్ధి ఆధారంగా జరగాలని, కేవలం జనాభా ఆధారంగా మాత్రమే కాకూడదని డిమాండ్ చేశారు. ‘ఈ అంశంలో జరిగే నష్టంపై మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు’ అని హెచ్చరించారు.
దక్షిణాది రాష్ర్టాలు దేశ జీడీపీలో 36 శాతం సహకారం అందిస్తున్నా, కేవలం 19 శాతం జనాభానే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి పార్లమెంట్లో 36 శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలి. జనాభాతోపాటు ఆర్థిక, పరిపాలన అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే పనులు చేయాలి. రాష్ర్టాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలి.
-కేటీఆర్
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏండ్లపాటు సాగిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తూ మెజారిటీ నియంతృత్వంతో కలిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మందబలాన్ని ఓ వైపు ఎదురిస్తూనే మరోవైపు సమైక్య రాష్ట్రంలోని మెజారిటీ నాయకత్వంపై పోరాటం చేసి తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి 14 ఏండ్లు పట్టిందని చెప్పారు. తమిళనాడు ప్రజల నుంచి అస్తిత్వం, హకుల కోసం పోరాడే స్ఫూర్తిని తీసుకుంటామని తెలిపారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో రాష్ర్టాల హకుల సాధనకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీజేపీ ప్రయోజనాల కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో డీలిమిటేషన్ చేయకపోగా, జమ్ముకశ్మీర్‌లో మాత్రం అమలు చేసిందని విమర్శించారు. ‘బీజేపీ వంటి పార్టీలు ఈ సమావేశాన్ని దేశ వ్యతిరేకంగా చూపే ప్రయత్నం చేసినా మేమంతా భారతీయులం.. దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నం’ అని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ర్టాల పార్టీలు, నేతలతో కలిసి డీలిమిటేషన్ విధానంపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
శనివారం చెన్నైలో ‘డీలిమిటేషన్’పై జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్‌తో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు