న్యూఢిల్లీ, జూలై 21: వరుసగా రెండో రోజూ మణిపూర్ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. మణిపూర్ హింసపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లోనూ శుక్రవారం గందరగోళం నెలకొన్నది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. మరోవైపు గురువారం నాడు సభలో జరిగిన గందరగోళానికి సంబంధించిన ‘మణిపూర్, ప్రధాని మోదీ’ పదాలను రాజ్యసభ చైర్మన్ రికార్డుల నుంచి తొలగించడం వివాదాస్పదమైంది. దీంతో చైర్మన్ నిర్ణయంపై విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన ఆ పదాలను తొలగించారో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ‘మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని గురువారం మేం డిమాండ్ చేశాం. ప్రధాని మోదీ, మణిపూర్ పదాలు రికార్డుల నుంచి తొలగించారు. ఏ కారణంగా వాటిని తొలగించాల్సి వచ్చిందో చెప్పాలి. రూల్ బుక్‌లోని ఏ నియమం ప్రకారం తొలగించారు. అది ఏ పేజీలో ఉందో చెబితే పార్లమెంట్ కార్యక్రమాలకు ఏ పదాలు సరైనవి కావో తెలుసుకుంటాం’ అని టీఎంసీ సభ్యుడు ఓబ్రియన్ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, అటవీ సంరక్షణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చైర్మన్ ప్రకటించగా సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెండో రోజూ కూడా లోక్‌సభలో కార్యక్రమాలు సజావుగా సాగలేదు. విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ హోరెత్తింది. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొన్నది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. దీంతో ఆందోళనలతో సమస్యలకు పరిష్కారం దొరకదని, చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యులకు తెలిపారు.
న్యూఢిల్లీ: ‘రూల్ 267 ప్రకారం సభలో అన్ని కార్యక్రమాలను పక్కనపెట్టి మణిపూర్ అంశంపై అత్యవసరంగా చర్చించాలి’ గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే చేసిన డిమాండ్ ఇది. ‘మణిపూర్ అంశంపై రూల్ 176 ప్రకారం చర్చిద్దాం’ విపక్షాల నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పిన సమాధానమిది. మణిపూర్ అంశంలో చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు రూల్ 267నే ప్రస్తావిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రూల్ 176 ప్రకారం చర్చిద్దామని చెబుతున్నది. దీంతో వీటిపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
రాజ్యాంగం ప్రకారం రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు సభ్యులు ఏదైనా అత్యవసర అంశంపై చర్చించేందుకు నోటీసులు అందించవచ్చు. దీని ప్రకారం ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి ఆ అంశంపైనే చర్చించాలి. ఈ రూల్ ప్రకారం చర్చించేందుకు నిర్ణీత సమయం ఉండదు. రూల్ 176 కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేయాలి. ఇద్దరు సభ్యులు ఆ నోటీసుకు మద్దతుగా సంతకం చేయాలి. ఈ నోటీసు కింద గరిష్ఠంగా రెండున్నర గంటల పాటు చర్చకు అవకాశం ఉంటుంది. నోటీసు అందుకున్న వెంటనే లేదా తర్వాతి రోజు చర్చకు అవకాశం ఇస్తారు.