BRS Public Meeting Live Updates | మహారాష్ట్ర( Maharashtra )లోని నాందేడ్ జిల్లా( Nanded Dist )లోని లోహా పట్టణం( Loha Town ) బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ( BRS Meeting ) విజయవంతమైంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో రైతులు, యువకులు, ప్రజలు తరలివచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయమయ్యాయి.
ఫసల్ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా..? బీఆర్ఎస్ను గెలిపించండి.. రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేక చోట్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహారాష్ట్ర అంతటా సమావేశాలు ఏర్పాటు చేస్తాం.
బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి. స్థానిక సంస్థల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించండి.. మీ సమస్యలను పరిష్కరించి చూపిస్తాం. ఇది రాజకీయ సభ కాదు.. బతుకులపై ఆలోచన సభ.
దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు. పీఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ. 10 వేలు ఇవ్వాలి. మహారాష్ట్రలో ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. ఉల్లి, చెరుకు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా..? ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. జీవితాంతం రైతులు పోరాడాల్సిందేనా..? కాంగ్రెస్, బీజేపీ పాలనలో రైతుల బతుకులు మారలేదు.
కాంగ్రెస్, బీజేపీ పాలనతో మన బతుకులు మారాయా..? అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగట్లేదు. మహారాష్ట్రలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో సాగు, తాగు నీరు అన్నిచోట్లకు అందుబాటులో లేదు. నేను ఒక్కసారి నాందేడ్‌కు వచ్చి వెళ్లేసరికి మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్లో నిధులు పెంచారు. నేతలు తలుచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు.
ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు.. ఈ దేశ ప్రజలకు ఏం మంచి పనులు చేశాయి..? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినప్పటికీ ప్రజల బతుకులు మారలేదు. రెండు పార్టీల పాలనలో ఏం తేడా కనిపించలేదు. నేను చెప్పేది నిజమో.. అబద్ధమో గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఈ రెండు పార్టీలకు రైతులకు ఏం చేయలేదు. అన్ని దేశాల కంటే సాగుకు యోగ్యమైన భూమి మన దేశంలో ఉంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా సాగు నీటికి వనరులు ఉన్నాయి. కానీ పాలకులు మాత్రం సాగునీటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయరు.
దేశంలో త్వరలోనై రైతుల తుపాను రాబోతుంది.. దాన్నెవరూ ఆపలేరు.. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం. ఫడ్నవీస్ దళిత బంధు అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. తెలంగాణలో దళితుల కోసం దళితబందు అమలు చేశాం. తెలంగాణ మోడల్లాగా ప్రతి రైతుక ఎకరాకు 10 వేలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటాను.
ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన మరాఠా నేలకు ప్రణామం.. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. లోహా సభకు తరలివచ్చిన ప్రజలకు, రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు.. షోలాపూర్ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.. అక్కడికి త్వరలోనే వెళ్తాను. లోహాకు వచ్చే దారులన్నీ రైతులు, ప్రజలతో కిక్కిరిసిపోయాయి. నాందేడ్ ప్రజల ప్రేమ, అభిమానానికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
Cmkcr Loha12
మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేకు ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, హర్షవర్ధన్ జాధవ్, సురేశ్ గైక్వాడ్, యశ్పాల్ బింగే, నాగ్నాథ్ గిస్సేవాడ్, మాజీ ఎమ్మెల్యే మనోహర్ పట్వారీ, ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు దగ్దా పవార్, ఛత్రపతి శివాజీ మరాఠా నవయువక్ మండల్ ప్రెసిడెంట్ మదన్ జాధవ్, స్పోర్ట్స్ కన్వీనర్ దిలీప్ కుమార్ జగ్టప్, సతీశ్ నల్గే, సతీశ్ షిండే, ప్రహ్లాద్ రాకోండే, వార్దా మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే, ఎన్సీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివరాజ్ దోండ్గే, లక్ష్మణ్‌రావు వోంగేతోపాటు నాందేడ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
సభా వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్, కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
Cmkcr Loha
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికపై నుంచి ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. ఈ సమయంలో జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
లోహా పట్టణంలోని బైల్ బజార్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభా ప్రాంగణం.. రైతులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. రైతులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు మరాఠాలు ఆసక్తి చూపుతున్నారు. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోతోంది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కంధార్ లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు కేసీఆర్ బయల్దేరిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ సభకు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంక్షేమ పథకాలను మరాఠా వీడియో డాక్యుమెంటరీల ద్వారా సభ నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు.
కంధార్ లోహాలో మరికాసేపట్లో ప్రారంభం కాబోయే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో యువత తరలివస్తున్నారు. చిన్నారులు సైతం కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చిన్నారులు బీఆర్ఎస్ జెండాలు చేతబూని.. ఆటోలు, ఇతర వాహనాల్లో లోహాకు బయల్దేరారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్‌లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. సాగునీటి వసతి కల్పించలేదు. వర్షాధారంగా సాగు చేయాల్సిన దుస్థితి. కరంట్ ఎప్పుడు వస్తుందో? పోతుందో? తెలియదు. సూటిగా చెప్పాలంటే కరెంటు వస్తే ఇక్కడ వార్త. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట పండిస్తే రేటు ఉండదు. ప్రభుత్వం కొనదు. దళారులకు అమ్ముకోవాల్సిందే. మీ కళ్ల ముందు కనిపిస్తున్న ఉల్లి రైతుల ఉద్యమమే అందుకు నిదర్శనం. పెట్టుబడి కూడా చేతికి రాని దుస్థితి. ఇక విద్య, వైద్యం, పెండ్లి మొదలగు వాటికి అప్పులు చేయకతప్పని పరిస్థితి. అదీగాక ప్రకృతి వైపరీత్యాలు. ఇవే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఇక్కడి రైతులవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు.
లోహా పట్టణంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు యువకులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంధార్ చారిత్రక కోట వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను యువకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కాందార్ లోహా పర్యటనకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో బయలుదేరి లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
లోహ పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు నాందేడ్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా తరలివస్తున్నారు. స్వచ్ఛందంగా ఆటోల్లో సభా ప్రాంగణానికి జనాలు బయల్దేరారు. నాందేడ్‌లోని పలు గ్రామాలకు చెందిన యువత కూడా బీఆర్ఎస్ మీటింగ్‌కు బయల్దేరారు. కేసీఆర్ స్పీచ్ వినేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది.
మహారాష్ట్రలో అతి పురాతన, మార్కిస్ట్ రాజకీయ పార్టీ.. పెజెంట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (పీడబ్ల్యూపీఐ). 1948లో కేశవరావు జేఢే నేతృత్వంలో ఇది ఆవిర్భవించింది. రైతులు, రైతుకూలీల హక్కుల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నది. పర్భణి, నాందేడ్, రాయ్‌గడ్ జిల్లాల్లో నేటికీ బలంగా ఉన్నది. ముఖ్యంగా కంధార్, లోహా మొదటి నుంచి పీడబ్ల్యూపీ వెంటే నిలబడుతుండటం విశేషం. కంధార్ నియోజకవర్గం 1972లో ఏర్పాటయింది. పీడబ్ల్యూపీకి చెందిన దోండ్గే కే శంకర్రావు తొలి ఎమ్మెల్యేగా గెలిశారు. 2004 వరకు 8 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించగా, నాలుగుసార్లు పీడబ్ల్యూపీ అభ్యర్థులే గెలవటం విశేషం. 2008 నియోజకవర్గ పునర్విభజనలో కంధార్ రెండు నియోజకవర్గాలుగా ఏర్పడింది. అందులో ఒకటి ముద్ఖేడ్ కాగా రెండోది ప్రస్తుత లోహా. లోహా నియోజకవర్గ మొదటి ఎన్నికలో ఎన్సీపీ తరఫున శంకరన్న దోండ్గే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొదటి నుంచీ రైతు, రైతుకూలీల పోరాటాలతో నిర్వహించిన నాయకుడే. ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్యాంసుందర్‌రావు దడ్గోజీ షిండే కూడా పీడబ్ల్యూపీ తరఫునే ఎన్నికవడం విశేషం.
లోహా నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.94 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులోనూ గ్రామీణ జనాభా 86 శాతం. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 20 శాతానికి పైమాటే. సాగునీటి వసతులు లేని లోహా పూర్తిగా కరువుపీడిత ప్రాంతం. తెలంగాణకు సమీపంలో ఉండటంతోపాటు ఇక్కడి గ్రామాల నుంచి కార్మికులు బాసర, బోధన్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాల తీరు, సాధిస్తున్న ప్రగతి లోహా వరకు పాకింది. ఇప్పుడు కేసీఆరే కిసాన్ సర్కార్ నినాదంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంతో లోహా రైతులు మురిసిపోతున్నారు. బీఆర్ఎస్తో మమేకం అవుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఎన్సీపీతోపాటు చిన్న పార్టీలన్నీ ఖాళీ అయ్యాయంటే బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.
నాందేడ్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతం నుంచి గోదావరి, పెన్‌గంగా నదులు ప్రవహిస్తున్నా రైతులకు సాగునీటి వసతి లేదు. జిల్లాలో విష్ణుపురి, బాబ్లీ తప్ప మరో ప్రాజెక్టే లేదు. భూగర్భ జలాలున్నా, బోరు వేయించుకొని వ్యవసాయం చేద్దామన్నా.. తెలంగాణ లాగ వ్యవసాయనికి ఉచిత కరెంటు లేదు. అందుకే మేం పత్తి, జొన్న, మక్క లాంటి వర్షాధార పంటలు పండిస్తాం. – రామ్రావు పాంచాల్, బేరడీ గ్రామ రైతు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నేను విన్నాను. నాకు 20 ఎకరాల భూమి ఉంది. రెండెకరాలకే బోరు ద్వారా నీటి వసతి ఉన్నది. కరెంటు కూడా సక్రమంగా లేక పంటలకు సరిగ్గా నీరందటం లేదు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తే మద్దతు ధర కూడా లభించదు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ మాలాంటి పేద రైతు వర్గాల్లో ఎంతో ఆశను పెంచింది. చాలామంది రైతులు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేద్దామని అంటున్నారు. -దిగంబర్ శేష్‌రావు షిండే, హల్దౌ గ్రామ రైతు
ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలు మాకు అందటం లేదు. కనీసం రేషన్ గోధుమలు కూడా ప్రతి నెలా ఇయ్యరు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. రేషన్ సరకులు కూడా సమయానికి లభించే వ్యవస్థ లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. -రహమాన్ ఖురేషీ, వ్యాపారి
మా ప్రాంతంతో రోడ్లు ఎంతో అధ్వాన్నంగా ఉన్నాయి. కంధార్-లోహాను కలిపే రహదారి కూడా సింగిల్ రోడ్డు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వివిధ గ్రామాలను కలిపే జిల్లా పరిషత్తు రోడ్లు, లింకు రోడ్లు కూడా గుంతల మయమే. పారిశుద్ధ్యం కూడా అంతంతే. -రామోబా బలిరాం, లోహా గ్రామస్థుడు
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సభకు జరుగుతున్న ఏర్పాట్లు నేను ఎప్పుడూ చూడలేదు. గతంలో ఎన్నికలప్పుడు ఎంతోమంది నాయకుల సభలు జరిగాయి. ప్రధాని మోదీ సభకూ ఇలాంటి ఏర్పాట్లు జరగలేదు. చుట్టుపక్కన గ్రామాల్లో జరుగుతున్న చర్చను విని.. నేను 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. -రుషికేశ్, యువ పట్టభద్రుడు
లోహా, కంధార్ పట్టణంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పైనే చర్చ జరుగుతున్నది. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మరాఠా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ గురించి వినడం, టీవీల్లో చూస్తూ మురిసిపోయేవారమని, ఇప్పుడు ఆయన స్వయంగా వస్తుండటం ఆనందంగా ఉన్నదని మరాఠీ రైతులు సంబురపడుతున్నారు. దేశంలో రైతుల సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అంటూ వేనోళ్లతో కీర్తిస్తున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ, శివసేననే కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదని, 5 వేల మంది మించితేనే మహా గొప్పని.. కానీ, ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంపై ఆశ్చర్యపోతున్నారు.
సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు.