న్యూఢిల్లీ, జనవరి 30: మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్పష్టంచేసింది. సభలో అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ సహా 27 పార్టీలకు చెందిన 37 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఎవరూ సమావేశానికి రాలేదు. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్, జేడీయూ, బీజేడీ, టీఎంసీ తదితర పార్టీలు తమ వాదనను గట్టిగా వినిపించాయి. గత సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఈసారైనా ఆ పద్ధతి మారాలని డిమాండ్ చేశాయి.
గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాలి
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను గవర్నర్లు చికాకుపరుస్తుండటంపై సమావేశంలో బీఆర్ఎస్, డీఎంకే గట్టిగా నిలదీశాయి. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగి తీరాలని పట్టుబట్టాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాయి. కోట్ల మంది సామాన్యుల సొమ్మును అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిందని, ఈ అంశంపై కేంద్రం ఇప్పటికీ స్పందించకపోవటం దారుణమని ఆర్జేడీ నేత మనోజ్ ఝా సమావేశం అనంతరం మీడియాతో పేర్కొన్నారు. రాష్ర్టాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మోదీ సర్కారు చూపుతున్న వివక్షపై కూడా చర్చ చేపట్టాలని బీఆర్ఎస్, డీఎంకే, వైసీపీ, టీఎంసీ, జేడీయూ డిమాండ్ చేశాయి. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగం, నిత్యావసర ధరలపై చర్చకు అవకాశం ఉండాలని సూచించాయి. నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.