న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేదార్నాథ్ వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా, ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ జాతీయ రహదారిపై సోన్ప్రయాగ, గౌరీకుంద్ మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నది. కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు అక్కడికి చేరుకొని, ఘటనాస్థలం నుంచి ఐదు మృతదేహాల్ని వెలికితీసినట్టు రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ చెప్పారు. శిథిలాల కింద మరికొంత మంది యాత్రికులు చిక్కుకుపోయి ఉండొచ్చునని పోలీసులు తెలిపారు. జమ్ముకశ్మీర్లో వైష్ణోదేవి ఆలయాన్ని చేరుకునేందుకు కొత్తగా ఏర్పాటుచేసిన మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా యాత్రికులు చనిపోయారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సైబర్ భద్రతను మరింత పటిష్ఠం చేయడం కోసం కేంద్రం కీలక చర్యలు ప్రకటించింది. 5 వేల మంది సైబర్ కమెండోల నియామకం, వెబ్ ఆధారిత డాటా రిజిస్ట్రీ, సైబర్ నేరాల సమచారం పంచుకొనే పోర్టల్, జాతీయ అనుమానితుల రిజిస్ట్రీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. సైబర్ నేరాలకు హద్దులు లేవని.. సైబర్ భద్రత లేకుండా జాతీయ భద్రత అసాధ్యమని అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన భారత సైబర్ నేరాల సహకార కేంద్రం(ఐ4సి) మొదటి వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా ప్రసంగించారు. కేంద్ర, రాష్ర్టాలకు సంబంధించిన సంబంధిత సంస్థల ప్రతినిధులతో సైబర్ నేరాల తగ్గింపు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.