భోపాల్: ఒక వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు. ఆ బ్రిడ్జిపై వెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశమున్నది. (Bhopal bridge) ఈ నేపథ్యంలో ఆ వంతెన నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బ్రిడ్జి డిజైన్‌ను అధికారులు సమర్థించుకున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌లోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జీ (ఆర్వోబీ)ని రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించారు. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో ఒక చోట 90 డిగ్రీల మలుపు ఉన్నది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంగా నిర్మించిన ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందే వివాదానికి కేంద్రంగా మారింది. 90 డిగ్రీల మలుపుపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఇది భోపాల్‌లోని ఐష్బాగ్ రైల్ ఓవర్ బ్రిడ్జి. దీనిని పూర్తి చేయడానికి పీడబ్ల్యూడీకి పదేళ్లు పట్టింది. ఇది ఒక రకమైన ‘ఇంజనీరింగ్ అద్భుతం’ లాంటిది. అధికారం, అవినీతి ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పుడు, పుస్తకాలకే పరిమితమైన అసమర్థ ప్లానర్లు ప్రణాళికలు రూపొందించినప్పుడు, ఇంజనీర్లు మెరిట్ ద్వారా కాకుండా విరాళం ద్వారా డిగ్రీలు సంపాదించినప్పుడు, మీరు వంతెనలకు బదులుగా విపత్తులను పొందుతారు. 90 డిగ్రీల మలుపుతో ప్రమాదాలకు ఆహ్వానం’ అని ఒకరు ఎక్స్‌లో మండిపడ్డారు. ‘మరణం 90 డిగ్రీల కోణంలో వస్తుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో ఉద్భవించిన అభివృద్ధి కోణం ఇది. వంతెన కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారు’ అని మరో వ్యక్తి ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ ప్రాజెక్టుకు చెందిన అధికారులు వంతెన డిజైన్‌ను సమర్థించుకున్నారు. మెట్రో స్టేషన్ కారణంగా అక్కడ తగినంత భూమి అందుబాటులో లేదని తెలిపారు. వేరే మార్గం లేక ఇలా నిర్మించినట్లు చెప్పారు. రెండు కాలనీలను అనుసంధానించడమే ఆర్వోబీ ఉద్దేశమని అన్నారు. చిన్న వాహనాలు మాత్రమే ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించడానికి అనుమతిస్తామని వివరించారు. అయితే వంతెన నిర్మాణంపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని పీడబ్ల్యూడీ మంత్రి రాకేష్ సింగ్ వెల్లడించారు.
Also Read: