నేషనల్ డెస్క్:రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్ర శస్ర్తాలను సిద్ధం చేసుకొంటున్నాయి. కీలక స్థానాలను ప్రభావితం చేయగల వర్గాలను ఆకర్షించడానికి వ్యూహాలను సిద్ధం చేసుకొంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 13 శాతం జనాభా ఉన్న బ్రాహ్మణ వర్గాన్ని తమ వైపు తిప్పుకొనేందుకు ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించాయి. మరి ‘బ్రాహ్మణీయం’ ఏ పార్టీ వైపునకు మొగ్గుచూపుతున్నది?
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 40కి పైగా నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న కమ్యూనిటీగా బ్రాహ్మణ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అందుకే ఈ కమ్యూనిటీని ప్రసన్నం చేసుకొనేందుకు బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
వ్యూహాలతో ముందుకు
బ్రాహ్మణ ఓట్లను రాబట్టుకోవడానికి అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీ ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఆ వర్గాన్ని ప్రభావితం చేయగల నాయకులకు ఇప్పటికే తగిన ప్రాధాన్యం ఇచ్చింది. బ్రాహ్మణ కమ్యూనిటీ ప్రభావం కలిగిన స్థానాల్లో ఆ వర్గం నేతలకే టికెట్లను ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి తోడు.. బ్రాహ్మణ కమ్యూనిటీలో కీలక నేతలుగా పేరున్న పలువురు నేతలు బీజేపీ, బీఎస్పీ నుంచి పార్టీలోకి రావడం అఖిలేశ్‌కు కలిసొచ్చింది. పూర్వాంచల్ (తూర్పు యూపీ) రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపిస్తుంది. అక్కడ బ్రాహ్మణ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువ. ఆ ప్రాంతంలో కీలక నేతలుగా ఉన్న పండిట్ హరి శంకర్ తివారీ, దిగ్విజయ్ నారాయణ్ చౌబే తదితరులు బీజేపీ నుంచి ఎస్పీలో చేరారు. కథేరీలో నిర్వహించిన సభకు 20 జిల్లాల బ్రాహ్మణ నేతలు పెద్దఎత్తున హాజరవ్వడాన్ని చూస్తే ఆ వర్గం ఎస్పీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది.
కమిటీ ఏర్పాటు కలిసొస్తుందా?
బ్రాహ్మణ ఓట్లను రాబట్టడానికి రాజ్యసభ ఎంపీ శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని బీజేపీ ఇటీవల ఏర్పాటు చేసింది. అయితే, టికెట్ల కేటాయింపులో స్థానిక నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ద్వితీయ శ్రేణి క్యాడర్లో అసంతృప్తి ఉన్నది. ఇదే విషయాన్ని కమిటీ సభ్యులు అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి నేతల ఎంపిక, కార్యాచరణను తమకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, గడిచిన ఐదేండ్లలో యోగి సర్కారు బ్రాహ్మణ కమ్యూనిటీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆ వర్గంలో అసమ్మతికి కారణమైందన్న విషయాన్ని ఎత్తిచూపారు. బ్రాహ్మణుల ఓట్లు దూరమవుతాయన్న కారణంతోనే రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి బీజేపీ తొలగించడం లేదన్నది ఓ వాదన. అయితే, యూపీ ఎన్నికల్లో లాభం చేకూరుస్తుందనుకొన్న ఈ స్టంట్ బీజేపీకి నష్టాన్నే మిగల్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీపై ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించడం బీజేపీకి మింగుడుపడటం లేదు. బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నా యోగి సర్కారు మొద్దు నిద్ర పోతున్నదని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేదీ మండిపడ్డారు. యోగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులపై జరిగిన దాడులు, నిందితుల అరెస్టుల వివరాలను లెక్కలతో సహా చూపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అప్పటి దూకుడు ఇప్పుడేది?
గతంలో పార్టీకి గట్టి ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణ వర్గం ఓట్లను నిలుపుకోవడమే లక్ష్యంగా గత జూలైలో బీఎస్పీ ‘ప్రబుద్ధ వర్గ్ సమ్మేళన్’ పేరిట కార్యక్రమాలను చేపట్టింది. పార్టీ గుర్తులో ఉన్న ఏనుగు.. విఘ్నేషుడికి ప్రతిరూపమంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ వర్గానికి ఎలా లబ్ధి చేకూరుతుందో స్పష్టతనివ్వలేకపోవడం, ఈ సభలకు అధినేత్రి మాయావతి దూరంగా ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఈ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం బీఎస్పీ దూకుడు కనిపించట్లేదు. 2017 ఎన్నికల్లో ఎస్పీతో జతకట్టి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో ఎదురీదుతున్నది. ప్రచారంలోనూ వెనుకబడింది. రాష్ట్రంలో 13 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గం కోసం.. 19 శాతం ఉన్న ముస్లింలను ప్రధాన పార్టీలు పక్కనబెడుతున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం 100 సీట్లలో పోటీ చేయనున్నది.