Bomb threats : ఈ మధ్య కాలంలో దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
బెదిరింపు మెయిల్స్ అందుకున్న ఆస్పత్రుల్లో మోనిక్ హాస్పిటల్, సీకే బిర్లా హాస్పిటల్ ఉన్నాయి. ఆస్పత్రుల్లోని బెడ్స్, టాయిలెట్స్‌లో బాంబులు ఉన్నట్లు ఈ-మెయిల్స్‌లో బెదిరించారు. దాంతో ఆయా ఆస్పత్రులు సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు బాంబు స్క్వాడ్, లోకల్ పోలీసులు రంగంలోకి దిగారు.
బెదిరింపు మెయిల్స్ అందుకున్న ఆస్పత్రుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో అవి బెదిరింపు మెయిల్స్ అని నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలోపడ్డారు.