Bomb Threat | జీలం ఎక్స్‌ప్రెస్ (Jhelum Express) రైలుకు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రైలులో బాంబు పెట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపినట్లు భోపాల్ రైల్వే డివిజన్ తెలిపింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. అయితే, బాంబు బెదిరింపుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పూణె నుంచి జమ్మూతావికి వెళ్తున్న 11077 జీలం ఎక్స్‌ప్రెస్ రైలు స్లీపర్ కోచ్‌లో బాంబు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రైలు భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌తోపాటు జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది గంటపాటు రైలంతా జల్లెడపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో కాసేపటికి రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. బాంబు గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది.
దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మొన్నికి మొన్న దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 100 పాఠశాలలకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఢిల్లీలో పలు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అంతేకాదు, చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు అప్పట్లోనే వెల్లడించారు. అంతేకాదు, పలు విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read..
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
Amethi | కాంగ్రెస్ కంచుకోటలో ‘శర్మ’లు.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు