Amethi | కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా.. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ స్థానం నుంచి హస్తం పార్టీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథి నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మను (Kishori Lal Sharma) రంగంలోకి దించింది.
అమేథి లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ స్థానానికి గాంధీ కుటుంబ సభ్యులే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. తాజాగా 26 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అక్కడ గాంధీయేతరులకు (Non Gandhi) హస్తం పార్టీ అవకాశం కల్పించడం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
1980లో తొలిసారి అమేథి స్థానాన్ని గాంధీ కుటుంబం గెలుచుకుంది. సంజయ్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 1981లో ఆయన మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సంజయ్ గాంధీ సోదరుడు రాజీవ్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి 1991 వరకూ ఆ స్థానంలో రాజీవ్ గాంధీ కొనసాగారు. 1991లో ఆయన మరణించిన తర్వాత అమేథి స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు హస్తం పార్టీ సతీశ్ శర్మను బరిలోకి దింపి విజయం సాధించింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లోనూ సతీశ్ శర్మే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే, 1998లో కాంగ్రెస్‌కి ఓటు శాతం తగ్గింది. ఆ ఎన్నికల్లో అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత 1999లో సోనియా గాంధీ అమేథి నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో అమేథి స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
ఇక ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అమేథి నుంచి తొలిసారి బరిలోకి దింపింది. ఇక అప్పటి నుంచి 2009, 2014 వరకూ రాహుల్ ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో రాహుల్ అమేథితోపాటు కేరళలోని వాయనాడ్ నుంచీ కూడా పోటీ చేసి గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో కూడా అమేథి నుంచి గాంధీ కుటుంబమే బరిలోకి దిగుతుందని అంతా భావించారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లు కూడా వినిపించాయి. అమేథి నుంచి రాహుల్ లేదా ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఎవరో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో కిశోరీ లాల్ శర్మను (Kishori Lal Sharma) హస్తం పార్టీ రంగంలోకి దించింది. రాహుల్‌ను రాయ్‌బరేలి స్థానానికి పంపింది.
మరోవైపు రాహుల్ గాంధీ ప్రస్తుతం పోటీ చేస్తున్న రాయ్‌బరేలి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆ స్థానాన్ని ఇప్పుడు రాహుల్‌కు కేటాయించారు.
Also Read..
Rahul Gandhi | వీడిన ఉత్కంఠ.. రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
Jewellers store | గోల్డ్ షాప్‌లో పేలిన ఏసీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు