Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై అత్యాచారం కేసు (Rape case) నమోదైంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ (SIT) అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.
కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసు (Sex Abuse Charges) తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేగౌడ కుమారుడు రేవణ్ణ (HD Revanna), మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.
ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఏ1 నిందితుడు ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి హెచ్డి.రేవణ్ణ.. మధ్యంతర జామీను కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది.
Also Read..
Prajwal Revanna | బీజేపీకి ప్రజ్వల్ పోటు!.. లోక్‌సభ ఎన్నికల్లో సెక్స్ స్కాండల్ ప్రభావం
Prajwal Revanna | జర్మనీకి ప్రజ్వల్ రేవణ్ణ.. ఎలా వెళ్లారో తేల్చి చెప్పిన విదేశాంగశాఖ..!