న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గత 12 ఏండ్ల పాలనలో తొలిసారిగా ఒక బిల్లును ఆమోదించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ పరిస్థితిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్‌సభలో వీగిపోయిన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ శనివారం బీజేపీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ‘2023లో అన్ని పార్టీలు ఆమోదించిన పాత మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ తీసుకురండి. సోమవారం పార్లమెంట్‌ను సమావేశపరిచి ఆ బిల్లును పెట్టండి. మేమంతా మీకు ఓటు వేసి మద్దతు తెలుపుతాం. అప్పుడు చూద్దాం ఎవరు మహిళా వ్యతిరేకులో’ అని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లకు చెందిన పాత బిల్లు నారీ శక్తి వందన్ అధినియం లేదా రాజ్యాంగం (106వ సవరణ) చట్టం 2023, ఎప్పుడో ఆమోదం పొంది లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రియాంక డిమాండ్‌ను ఇండియా కూటమి సమర్థించింది.
కొత్త బిల్లు పేరుతో పాత బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. తమిళనాడులోని పొన్నేరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘మోదీ ప్రభుత్వం ఒక కొత్త బిల్లు తెచ్చింది. 2023లోనే అది సభల్లో ఆమోదం పొందినా అది మహిళా రిజర్వేషన్ల బిల్లు అని పేర్కొంది. తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించి, దక్షిణ, చిన్న, ఈశాన్య రాష్ర్టాలను బలహీన పరిచే లక్ష్యంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం (కొత్తబిల్లులో) అంతర్లీనంగా ఉంది. అందుకే మేం దానిని ఓడించాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
విపక్షాలకు రాజకీయాలే ప్రధానం n 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై మోదీ విమర్శదేశ హితం కోసం, నారీ శక్తి హితం కోసం బిల్లు తెస్తే దానిని విపక్షాలు స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన క్రమంలో శనివారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. కొందరికి దేశం కంటే రాజకీయాలే ప్రధానమని అన్నారు. ‘మహిళా బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ అడ్డుకున్నాయి. అలాంటి కుటుంబ పార్టీలు అతివలను అభివృద్ధి చెందనీయవు. ఆ పార్టీలు ఓడించింది బిల్లును కాదు.. మహిళా శక్తిని అని’ ప్రధాని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదని, అన్ని విషయాలను మహిళలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.