న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు కావడంపై సోమవారం రాత్రి కాంగ్రెస్ ఎక్స్‌లో ‘గాయబ్’ (మాయం) అన్న శీర్షికతో తల లేని ఓ ఫొటోను పోస్టు చేసింది. ప్రధాని మోదీని పోలిన ఆ ఫోటో ద్వారా పహల్గాం దాడికి ప్రతిచర్య విషయంలో ప్రధాని మోదీ నుంచి కార్యాచరణ శూన్యమన్న సంకేతాలను కాంగ్రెస్ ఈ పోస్టులో వ్యక్తం చేసింది. దీనికి బీజేపీ మంగళవారం కౌంటర్ ఇచ్చింది. తెలుపు రంగు టీషర్టు నలుపు రంగు ప్యాంటు, తలపై నెహ్రూ టోపీ ధరించి కత్తి చేతిలో పట్టుకుని వెనుకకు తిరిగి నిలబడిన ఓ వ్యక్తి ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించింది.