భోపాల్, డిసెంబర్ 3: మధ్యప్రదేశ్‌లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 230 స్థానాల్లో 163 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా.. తదితరుల నాయకత్వంతో ఈ విజయం దక్కిందంటూ క్రెడిట్ అంతా కేంద్ర నాయకత్వానిదేనంటూ ప్రకటించారు. ఎన్నికల్లో ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించే బీజేపీ.. ఈ సారి ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వెళ్లింది.
బీజేపీ అధిష్టానం పార్టీ నాయకత్వంలో కొత్త రక్తాన్ని ఎక్కించే ఆలోచన చేస్తున్నదని, చరిష్మా కలిగిన నాయకుడిగా జ్యోతిరాదిత్య సింధియాను సీఎంను చేస్తుందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి విరుగుడుగా ‘మీ మామ’ మళ్లీ సీఎం కావాలా? వద్దా?’.. అంటూ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన ప్రతిచోటా ప్రజల్ని ప్రశ్నించారు. తాజా విజయంతో ఆయన గ్రాఫ్ పెరిగింది.
శివరాజ్‌పై అధిష్ఠానం విముఖత
నాలుగుసార్లు సీఎంగా ఉండి, రాష్ట్ర ప్రజల చేత ‘మామాజీ’ అని పిలిపించుకుంటూ, పాపులర్ అయిన 64 ఏండ్ల శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీలో అంతర్గతంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపడానికి పార్టీ అధిష్టానం మొదట్నుంచీ విముఖతతో ఉంది. దీంతో ముగ్గురు కేంద్రమంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జాతీయ కార్యదర్శిని ఎన్నికల బరిలో దింపి, వీరిలో ఎవ్వరైనా ముఖ్యమంత్రి కావొచ్చు.. అనేది ప్రచారంలో పెట్టారు.
ప్రధాని మోదీ తన సభల్లో చౌహాన్ పాలన గురించి మాట్లాడకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి విషయాలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, కైలాశ్ విజయ్‌వర్గీయ, బీజేపీ రాష్ట్ర చీఫ్ వీడీ శర్మ.. తదితరులు సీఎం పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవిని చేపడతానని మరో సీనియర్ నాయకుడు గోపాల్ భార్గవ ప్రకటించారు.