PM Modi : పశ్చిమబెంగాల్ (West Bengal) లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఈరోజు మధ్యాహ్నం తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంత భారీ సభను గుజరాత్లో కూడా ఏర్పాటు చేయలేకపోయేవాళ్లమని, మే 4 తర్వాత రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయనడానికి ఈ సభలే నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ భయాందోళనలు సృష్టిస్తోందని.. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయబోమని స్పష్టంచేశారు. కేవలం తృణమూల్ నేతల అవినీతి, దోపిడీ దుకాణాలను మాత్రమే మూసివేస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇన్నాళ్లూ ఈ పథకాన్ని అమలు చేయకుండా తృణమూల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, బీజేపీ ప్రభుత్వంతో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వారికి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ఇక్కడ స్థిరపడటానికి సాయం చేసిన వారిని కూడా వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరించారు.
కాగా పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడుతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఈ నెల 9న పోలింగ్ ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనుంది. ఈ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.