BJP | న్యూఢిల్లీ, జూన్ 8: గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్కు 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే, ఈ ఎన్నికల్లో 53 సీట్లను కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాక బీజేపీకి 400 సీట్లు టార్గెట్ అంటూ ప్రచారం చేసిన ఆ పార్టీ నేతలు.. కనీసం 250 మార్కును కూడా అందుకోకపోవటంపై రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. మోదీ కరిష్మా, అతి హిందూత్వ అజెండా, సూపర్ మెజారిటీ తదితర కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీ కరిష్మాతోనే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే, ఈ సారి కూడా అదే ఆయుధంతో కమలం పార్టీ బరిలోకి దిగింది.
ఎంత మోదీ కరిష్మా ఉన్నా, అభ్యర్థులు, పార్టీ నిర్ణయాలు సరిగా లేకపోతే పరిస్థితులు అనుకూలించవు అని ఈ ఎన్నికలు రుజువు చేశాయని విశ్లేషిస్తున్నారు. ఇక, ‘అయోధ్య రామమందిరం’ తమను గెలిపిస్తుందని బీజేపీ నేతలు భావించారు. దేశమంతా వేవ్ ఉంటుందని చెప్పుకున్నారు. హిందూత్వ అజెండా తమకు సీట్లు తెచ్చిపెడుతుందని ఆశించారు. కానీ, తీరా ఫలితాలు చూస్తే హిందూత్వ అజెండా పనిచేయలేదని స్పష్టమవుతున్నదని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఓట్లను రాల్చినా, అతి హిందూత్వ అజెండాపై ప్రజలు పెదవి విరిచారని చెప్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విడిచి.. హిందూత్వ అజెండాతోనే గెలుస్తామంటే కష్టమేనని ఈ ఫలితాలు చెప్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ మిత్రపక్షాలు హిందుత్వ వాదాన్ని గట్టిగా వినిపించకపోవటమూ ఓ కారణమని విశ్లేషిస్తున్నారు.
బీజేపీకి సొంతంగా 400 మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్లినా చార్ సౌ పార్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదం కొన్ని వర్గాల్లో భయాందోళనలు కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ, అమిత్‌షా తిరుగులేని శక్తులుగా ఎదిగితే, వారు చేసిందే శాసనం అవుతుందన్న భయం ప్రారంభమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారు.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.. లాంటి ప్రతిపక్షాల ప్రచారాస్ర్తాలు దళితులు, మైనారిటీ వర్గాల్లో ఆందోళనలు కలిగించాయని, దాంతో బీజేపీ వారి ఓట్లను దూరం చేసుకొన్నదని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉపాధిలేమి సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా నిత్యం హిందూత్వ అజెండానే ముందుకు తీసుకురావటం ఓ వర్గం ఓటర్లలో అసంతృప్తిని పెంచిందని, దాని పర్యవసానమే ఈ ఎన్నికల్లో కనిపించిందని పేర్కొంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తుంటే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే ప్రధాన స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ తరపున ప్రచారం చేశారు. అయితే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బెంగాల్లో చేసిన ప్రచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని విశ్లేషణలు చెప్తున్నాయి. మోదీ బెంగాల్లో 27 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, అందులో 20 సీట్లలో బీజేపీ ఓటమి చవిచూసింది. అందులో గతంలో బీజేపీ గెలిచిన ఐదు సీట్లు కూడా ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీ 29 సీట్లలో నెగ్గగా, అరు సీట్లు తగ్గిన బీజేపీ 12కు మాత్రమే పరిమితమైంది. ఎలాగైనా బెంగాల్లో అధిక సీట్లు సాధించాలన్న ధ్యేయంతో మార్చి 1న విజయ్ సంకల్ప్ పేరుతో హుగ్లీలో ర్యాలీతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ మే 29న కోల్‌కతాలో మెగా రోడ్‌షోతో ప్రచారాన్ని ముగించారు. మోదీ తన ప్రచారంలో 22 బహిరంగ సభలు, ఒక రోడ్‌షో నిర్వహించినా కమలం పార్టీకి ఓటమి తప్పలేదు. బెంగాల్ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రులు కూడా ఓటమి బాట పట్టారు. లోక్‌సభ నుంచి సస్పెండైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పోటీ చేసిన కృష్ణానగర్‌లో మోదీ రెండుసార్లు ప్రచారం చేసినా బీజేపీ పరాజయంపాలైంది.