Karur Stampede | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. గతనెల 27న కరూర్‌లో టీవీకే (TVK) చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని టీవీకే ఆరోపిస్తోంది. అయితే, అధికార డీఎంకే మాత్రం విజయ్‌నే నిందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట ఘటనను పలు రాజకీయ పార్టీలు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఓ అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
తొక్కిసలాట ఘటనతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘటనను ఓ అవకాశంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ పార్టీతో బీజేపీ (BJP) నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాషాయ పార్టీకి ఈ ఘటన ఓ అవకాశంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు విజయ్ ఫ్యాన్ బేస్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం తొక్కిసలాట ఘటనతో విమర్శలు ఎదుర్కొంటున్న విజయ్‌కి అండగా నిలబడినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విజయ్‌ని డీఎంకే లక్ష్యంగా చేసుకుందని బీజేపీ వర్గాలు టీవీకే నాయకులతో అన్నట్లు సమాచారం. విజయ్ ఒంటరి కాదని అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చినట్లు టాక్.
తొక్కిసలాట ఘటనలో డీఎంకేనే ఇరుకున పెట్టాలని టీవీకేకి కమలం పార్టీ నేతలు సూచించినట్లు సమాచారం. అంతేకాదు, తొక్కిసలాట సంక్షోభం నుంచి బయటపడేందుకు ఓపికగా ముందుకు వెళ్లాలని కూడా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్రంలో ఏఐఏడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ ఆ పొత్తు దెబ్బతినకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. బీజేపీతోపాటూ కాంగ్రెస్ కూడా టీవీకేని సంప్రదించినట్లు తెలిసింది. డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యం వహిస్తున్న తమిళ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకునేందుకు జాతీయ పార్టీలు కరూర్ ఘటనను ఓ అవకాశంగా భావిస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల్లో ఆయన తన వ్యూహాలు మార్చుకునే అవకాశం లేకపోలేదు.
Also Read..
Nirav Modi | పీఎన్బీ రుణ ఎగవేత కేసులో కీలక పరిణామం.. నవంబర్ 23న భారత్‌కు నీరవ్ మోదీ..?
Israel | ట్రంప్ సూచనలు బేఖాతరు.. గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు మృతి