న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఐదేళ్లలో సుమారు 400 నుంచి 500 మంది ధనవంతులైన స్నేహితులకు పది లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏ మోడల్‌ను ఎంచుకుంటారో అన్నది ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. ‘ఢిల్లీ ప్రజలకు రెండు నమూనాలు ఉన్నాయి. మొదటిది కేజ్రీవాల్ మోడల్. ఇక్కడ ప్రజల డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తారు. రెండవది బీజేపీ మోడల్. ఇక్కడ ప్రజల డబ్బు ధనవంతులైన వారి స్నేహితుల జేబుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రజలు ఏ నమూనాను ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.
కాగా, ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఢిల్లీ ప్రజలు నెలకు రూ.25,000 వరకు ప్రయోజనాలను పొందుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే వారి నమూనాకు విరుద్ధం కాబట్టి అన్ని సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని అన్నారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.