న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది. సభ్యులందరూ సభలో హాజరుకావాలని ఆదేశిస్తూ పార్టీ విప్ జారీచేసినప్పటికీ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు డుమ్మా కొట్టడంపై బీజేపీ నాయకత్వం మండిపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వారికి నోటీసులు జారీచేయనున్నట్టు తెలిసింది. అయితే వివిధ వ్యక్తిగత, పని సంబంధ కారణాల వల్ల తాము సభకు హాజరుకాలేమని కొందరు ఎంపీలు ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చారని ఆ వర్గాలు వివరించాయి.