Wayanad By- Election : వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దృష్టి పెట్టాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో విజయమే లక్ష్యంగా పావులు రెండు పార్టీలు కదుపుతున్నాయి. లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న
రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ఆ సీటును మళ్లీ దక్కించుకునేందుకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)ని నిలబెట్టింది కాంగ్రెస్. నవంబర్ 13న ఎలక్షన్ జరుగునంది. దాంతో, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రియాంక తరఫున ప్రచారాన్ని వేగం చేసింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూతురిగా.. ఇందిరా గాంధీ ముద్దుల మనువరాలిగా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంకకు పోటీగా బలమైన అభ్యర్థిని బీజేపీ బరిలోకి దింపుతోంది. ప్రియాంకకు పోటీగా అలనాటి సినీ నటి ఖుష్బూను నిలబెడుతారనే వార్తలకు బీజేపీ నాయకత్వం చెక్ పెట్టింది. వయనాడ్ బై ఎలక్షన్లో తమ పార్టీ తరఫున కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అయిన నవ్య హరిదాస్ (Navya Haridas)ను ఖరారు చేసింది. తనను ప్రియాంకకు పోటీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల నవ్య సంతోషం వ్యక్తం చేసింది.
నవ్య హరిదాస్, ప్రియాంక గాంధీ
‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వయనాడ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు కోరుకుంటున్న అభివృద్దిని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ కుటుంబం చేయలేకపోయింది. ఈ ఎన్నికతో పార్లమెంట్లో తమ సమస్యలు వినిపించే ఎంపీ కావాలని వయనాడ్ నియోజకవర్గంలోని వాళ్లంతా భావిస్తున్నారు’ అని నవ్య తెలిపింది.
కొజికోడ్ కార్పొరేషన్ నుంచి నవ్య హరిదాస్ రెండు సార్లు కౌన్సిలర్‌గా విజయం సాధించింది. అంతేకాదు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ నాయకురాలిగానూ పని చేసింది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ పట్ల విధేయురాలిగా ఉన్న నవ్యకు అధిష్ఠానం బంపర్ ఆఫర్ ఇస్తూ వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేసింది.