Gujarat | అహ్మదాబాద్, జూన్ 8: బీజేపీ పాలిత గుజరాత్లో అవినీతి కేసులు పెరిగిపోతున్నాయి. లంచాలకు సంబంధించి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 104 కేసులను నమోదు చేసినట్టు ఏసీబీ ప్రకటించింది. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తులకు సంబంధించి మరో 10 కేసులు నమోదు చేసి, రూ.25 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు వెల్లడించింది. ప్రభుత్వ అధికారులు లంచాలు బాగా డిమాండ్ చేస్తున్నారని వాపోతూ ఏసీబీకీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారులకు భరోసా కల్పించేందుకు ఈ ఏడాది జనవరి 26న ‘కేర్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏసీబీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు నేరుగా ఫిర్యాదుదారుల ఇండ్లకు వెళ్తున్నారు. అవినీతి, లంచాలపై ఫిర్యాదు చేసినందుకు ఏమైనా వేధింపులు ఎదురవుతున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటివరకు 900 మంది ఫిర్యాదుదారులను కలిసినట్టు గుజరాత్ ఏసీబీ వెల్లడించింది.