న్యూఢిల్లీ : విపక్ష ఇండియా కూటమి 14 మంది టీవీ న్యూస్ యాంకర్లను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. మీడియా సహా పలు సంస్దలను బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర శుక్రవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ పార్టీ నేత రాహుల్ గాంధీని బహిష్కరిస్తే ఆ పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని ఎద్దేవా చేశారు.
14 టీవీ న్యూస్ యాంకర్ల షోస్‌ను బహిష్కరించాలని విపక్ష ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 14 మంది న్యూస్ యాంకర్లు హోస్ట్ చేసే షోలకు ఇండియా కూటమి పార్టీలు తమ ప్రతినిధులను పంపవని విపక్ష కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. విపక్ష కూటమి ఈసీ, కోర్టులు సహా దేశంలోని అన్ని వ్యవస్ధలపై దాడికి పాల్పడుతోందని సంబిట్ పాత్ర దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలంటే ఎవరినైనా బహిష్కరించాలని భావిస్తే అది వారి నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఎలాంటి బలం లేని రాహుల్‌ను వదిలించుకోవాలని పాత్ర హితవు పలికారు. ప్రేమ గురించి మాట్లాడే రాహుల్ వాస్తవానికి విద్వేష విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. విపక్ష కూటమి బహిష్కరించిన జర్నలిస్టులను విపక్ష సభ్యులు, వ్యక్తులు టార్గెట్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీకి మీడియాను టార్గెట్ చేసిన చరిత్ర ఉందని అన్నారు.
Read More :