Agnipath Scheme : లోక్‌సభ ఎన్నికల్లో కీలక హిందీ రాష్ట్రం యూపీలో బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది. ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్ స్కీమ్, పేపర్ లీక్స్, రాజ్‌పుత్‌లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్ భూపేంద్ర చౌధరి వివరించారు.
అధిష్టానానికి పంపిన ఈ నివేదికలో పార్టీ పరాజయానికి కారణాలను ఆయన ప్రస్తావించారు. యూపీలోని 80 లోక్‌సభ స్ధానాల పరిధిలో 40000 మంది పార్టీ కార్యకర్తల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. యూపీలో 80 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ కేవలం 33 స్ధానాల్లో విజయం సాధించింది. విపక్ష ఇండియా కూటమి 43 స్దానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలోని వెస్ట్రన్ యూపీ, బ్రజ్, కాన్పూర్-బుందేల్‌ఖండ్, అవధ్, గోరఖ్‌పూర్, కాశీ వంటి ఆరు ప్రాంతాల్లో బీజేపీ ఓట్ షేర్ 8 శాతం పడిపోయింది.
పశ్చిమ యూపీ, కాశీ ప్రాంతాల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో 28 సీట్లలో బీజేపీ కేవలం 8 సీట్లనే దక్కించుకుంది. బ్రజ్‌లో 13 స్ధానాలకు 8 స్దానాలను, గోరఖ్‌పూర్‌లో 13 స్ధానాలకు 6 స్ధానాల్లోనే కాషాయ పార్టీ గెలుపొందింది. ఇక అవధ్‌లో 16 సీట్లకు గాను 7 సీట్లకు పరిమితమైంది. కాన్పూర్-బుందేల్‌ఖండ్ రీజియన్‌లో 10 స్దానాలకు గాను కేవలం 4 స్ధానాలనే దక్కించుకోగలిగింది.
Read More :
Thangalaan | పండగ వచ్చిందే చాన్నాళ్లకు.. ఆకట్టుకుంటున్న తంగలాన్ సాంగ్