న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్‌కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్నికల కమిషన్ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. రూ.20,000 కన్నా ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను బీజేపీ, కాంగ్రెస్, మరో ఆరు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించినపుడు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ విరాళాల్లో 85 శాతం బీజేపీకి అందినట్లు వెల్లడైంది. 2024 లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో 56 శాతం విరాళాలను బీజేపీ పొందింది.
ఈ విరాళాల్లో అత్యధిక భాగం ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు ఏప్రిల్, మే నెలల్లోనే ఇచ్చారు. 2018-2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలు విరాళాలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరిస్తూ ఉండేవి. ఈ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో రద్దు చేసింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టు దక్కించుకున్న కార్పొరేట్ సంస్థలు రాజకీయ విరాళాలు ఇవ్వడానికి ఎలక్టొరల్ ట్రస్ట్‌ల బాట పట్టాయి. ఫలితంగా అత్యధిక రాజకీయ విరాళ దాతలుగా ఎలక్టోరల్ ట్రస్టులు నిలిచాయి. వీటిల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అగ్రస్థానంలో ఉంది. ఇది బీజేపీకి రూ.2,181 కోట్లు , కాంగ్రెస్‌కు రూ.216 కోట్లు విరాళం ఇచ్చింది.
ఈ ట్రస్ట్‌కు అత్యధిక విరాళాలు లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన ఎలివేటెడ్ అవెన్యూ రియాలిటీ ఎల్ఎల్పీ నుంచి వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టొరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.757.6 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.77.3 కోట్లు విరాళాలిచ్చింది. ఈ ట్రస్ట్ టాటా గ్రూప్ నియంత్రణలో ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఆకర్షణీయమైన రాయితీలతో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు టాటా గ్రూప్‌నకు దక్కాయి. బీజేపీకి భారీ విరాళం ఇచ్చిన ఒంటరి దాతగా టాటా గ్రూప్ నిలిచింది. ఎలక్టోరల్ ట్రస్టుల్లో భారీ విరాళాలిచ్చిన మూడో ట్రస్ట్‌గా ఏబీ జనరల్ ట్రస్ట్ నిలిచింది. ఈ ట్రస్ట్ బీజేపీకి రూ.606 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.15 కోట్లు విరాళాలు ఇచ్చింది. దీనికి దాతలు ఎవరో ఎన్నికల కమిషన్ వెల్లడించలేదు. సాధారణంగా దీనిని ఆదిత్య బిర్లా గ్రూప్ ఉపయోగించుకుంటుంది.
నాలుగో స్థానంలో ఉన్న న్యూ డెమొక్రాటిక్ ఎలక్టొరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.150 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.5 కోట్లు, శివసేన (యూబీటీ)కి రూ.5 కోట్లు విరాళాలు ఇచ్చింది. ఈ ట్రస్ట్‌కు నిధులు మహీంద్రా గ్రూప్ నుంచి వస్తున్నాయి. కొన్ని కంపెనీలు బీజేపీకి విరాళాలివ్వడాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఇస్తున్న విరాళాలతో పోల్చినపుడు, కేవలం బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు అవి అత్యధిక విరాళాలను ఇస్తున్నాయి. మొత్తం మీద ఎనిమిది ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాలు సుమారు రూ.7,000 కోట్ల వద్ద స్థిరంగా ఉంటున్నది. కానీ దీనిలో బీజేపీ వాటా మాత్రం 2023-24లో 56 శాతం నుంచి 2024-25లో 85 శాతానికి పెరిగింది. రూ.20,000 కన్నా తక్కువ విరాళాలు ఆడిట్ నివేదికల్లో బయటపడతాయి. డీఎంకేకు లభించిన విరాళాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
