హైదరాబాద్, మే 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం దూరమైంది. కాగా, 2021లో జరిగిన ఎన్నికల్లో చివరివరకూ పోరాడిన బీజేపీ 77 సీట్లకే పరిమితం కాగా, 215 స్థానాలను సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం తెలిసిందే.
ఎన్నికల ముందు షాక్‌లు
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఎంసీకి రాజకీయ వ్యూహాలను రూపొందించిన ఐప్యాక్‌పై ఈడీ దాడులు చేయించడం, మమత పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేయించడం, ‘సర్’ ప్రక్రియలో టీఎంసీ అనుకూలుర ఓట్లు భారీగా తొలగించినట్టు వార్తలు రావడం వెరసి బీజేపీకి బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి చేకూరినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై సోమవారం మమత స్పందించారు. సర్ ప్రక్రియ పేరిట బీజేపీ భారీగా ఓట్లను దొంగిలించిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం (ఈసీ) కేంద్ర బలగాలతో కలిసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ఒకట్రెండు సీట్లకే పరిమితం
బెంగాల్‌ను ఒకప్పుడు కంచుకోటగా చేసుకొన్న జాతీయ పార్టీలు సీపీఎం, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎంతమాత్రం ప్రభావం చూపించకుండాపోయాయి. 293 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలను గెలుచుకోగా, లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బెంగాల్లో సీపీఎం 33 ఏండ్లపాటు రాజ్యాధికారాన్ని చేపట్టగా, కాంగ్రెస్ 23 ఏండ్లపాటు అధికారంలో ఉండటం తెలిసిందే.
బీజేపీ ఓట్ల దోపిడీకి పాల్పడింది.. తిరిగి పుంజుకుంటాం.. బెంగాల్ ఓటమిపై మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గెలుపు కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 100కుపైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల దోపిడీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. 100కుపైగా స్థానాల్లో ఓట్లను దోచుకుంది. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిని మీరు విజయంగా భావిస్తున్నారా? బీజేపీ సాధించినది అనైతిక విజయం తప్ప, నైతిక విజయం కాదు. ఎన్నికల ఓటమి నుంచి కోలుకొని తృణమూల్ మళ్లీ పుంజుకుంటుంది’ అని అన్నారు.
