న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్ పాకిస్తాన్ లేదా చైనాకు చెందిన వ్యక్తా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత భారత టెలిప్రాంప్టర్ను ఉపయోగించాలని రాజ్యవర్ధన్ రాధోఢ్ సలహా ఇచ్చారు. కశ్మీర్లో భారత్ బలగాలపై రాహుల్ గాంధీ, పాకిస్తాన్ ఒకే అభిప్రాయాన్ని కలిగిఉన్నాయని ఆయన తప్పుపట్టారు. అదేమాదిరిగా జమ్ము కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మెరుగైన పనితీరు కనబరిచారని విపక్ష నేత, చైనా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో మాట్లాడుతూ చైనా తాను ఏం చేస్తోందో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోందని..డోక్లంలో వారి కార్యాచరణను అమలు చేశారని, డ్రాగన్ వ్యూహం భారత్కు అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మనం జమ్ము కశ్మీర్ విషయంలో, మన విదేశాంగ విధానంలో ఎన్నో వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, చైనాలను వేర్వేరుగా ఉంచేలా మన వ్యూహాత్మక లక్ష్యానికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఇరు దేశాలనూ దగ్గరకు చేర్చిందని మండిపడ్డారు. ఇక మోదీ హయాంలో ప్రస్తుతం దేశంలో రెండు భారత్లు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఇందులో ఒకటి ధనవంతులది కాగా, మరొకటి పేదలదని రాహుల్ ఎద్దేవా చేశారు.
ఈ రెండు వర్గాల మధ్య రానురానూ అంతరం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాల గొంతుకలను నొక్కివేయడానికి న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ స్పైవేర్లను కేంద్రం ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని రాహుల్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, అయితే మోదీ హయాంలో 23 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం 50 ఏండ్ల గరిష్టానికి చేరిందన్నారు. అయితే రాహుల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఆయన తల్లి ఇటాలియన్, తండ్రి భారతీయుడు కావడంతో ఆయనకు రెండు భారత్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేసింది.