న్యూఢిల్లీ: లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్లో సోమవారం రాహుల్ చేసిన వ్యాఖ్యలు పాలక, ప్రతిపక్షాల మధ్య మంటలు రేపాయి. రాహుల్ అబద్ధాలు చెప్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆరోపించారు.
‘రాహుల్ చరిత్రను, వాస్తవాలను సిగ్గు లేకుండా వక్రీకరించారు. మన దేశాన్ని అపహాస్యం చేయడానికి, మన గణతంత్ర ప్రతిష్ఠను తగ్గించడానికి ప్రయత్నించారు’ అని దూబే తన లేఖలో పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలకు రాహుల్ ఆధారాలు చూపకుంటే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించాలని దూబే యోచిస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. భారత్కు చెందిన 4 వేల చ.కి.మీ భూమిలో బీజింగ్(చైనా) తిష్ట వేసిందని రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్లో వ్యాఖ్యానించారు.