న్యూఢిల్లీ, మే 22 : సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సైనికులు ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను మొక్కారంటూ మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగ్దీష్ దేవ్డా చేసిన వ్యాఖ్యలను వారు తమ లేఖలోప్రస్తావించారు. వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు గురిచేసినట్లు వారు పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రక్షణ దళాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తు చేశారు. 2019 ఏప్రిల్ సాయుధ దళాలను యోగి ఆదిత్యనాథ్ ‘మోదీజీ కీ సేన’గా అభివర్ణించారని వారు తెలిపారు.
అయితే ఇప్పుడు ఆ లింకును యూట్యూబ్ నుంచి తొలగించారని వారు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం మౌనం వహించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నల్ సోఫియా ఖురేషీతోపాటు మొత్తం సాయుధ దళాలకు వారు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు రక్షణ దళాలకు చెందిన సిబ్బంది నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీసి దేశ భద్రత, సరిహద్దు సమగ్రత బలహీనపడేందుకు దారితీయగలదని వారు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యత, భద్రత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రపతి ముర్ముకు వారు విజ్ఞప్తి చేశారు.