ఇండోర్, జనవరి 2: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికార పీఠంపై కూర్చున్న వ్యక్తులు తాము మాత్రం బిస్లరీ నీళ్లు తాగుతూ నగర ప్రజలకు కనీసం తాగునీరును కూడా అందించలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుర్ఘటనకు బాధ్యులైన అధికారులు, నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం వివరణ లేదా క్షమాపణతో ఈ పాపం తుడిచిపెట్టుకుపోదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా అవార్డును సాధించిన నగరంలో దుర్గంధపూరితమైన, కలుషితమైన, విషపూరితమైన నీరు వల్ల మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని ఎక్స్ పోస్టులో ఉమాభారతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయి జీవితకాలం అంతులేని విషాదంలో కుటుంబాలు మిగిలిపోయి ఉండగా ప్రాణం విలువ కేవలం రూ.2 లక్షలు మాత్రమే కాదని ఆమె విమర్శించారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందేనని ఉమాభారతి పేర్కొన్నారు.