Richest Party BJP | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చి 2024 నాటికి ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వద్ద రూ.857.15 కోట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన డేటాతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2023-24లో లోక్సభ ఎన్నికలు ప్రకటించిన సమయంలో బీజేపీ రూ.1,754.06 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2022-23లో ఖర్చు చేసిన రూ.1,092 కోట్ల కంటే 60 శాతం ఎక్కువ. ఇక కాంగ్రెస్ పార్టీ 2023-24లో రూ.619.67 కోట్లు.. 2022-23లో రూ.192.56 కోట్లు ఖర్చు చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ గతేడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు అందించిన వార్షిక ఆడిట్ డేటా ప్రకారం.. 2023-24లో.. ప్రస్తుతం నిషేధించిన ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.1,685.69 కోట్లు స్వచ్ఛంద విరాళాలు అందాయి. గత సంవత్సరంలో ఆ పార్టీకి ఆ పార్టీకి రూ.1,294.15 కోట్లు వచ్చాయి. 2022-23 సంవత్సరంలో రూ.648.42 కోట్లు అందగా.. అదే ఏడాది బీజేపీకి రూ.2042.75 కోట్ల ఇతర గ్రాంట్లు కూడా అందాయని ఈసీకి ఇచ్చిన ఆడిట్లో బీజేపీ పేర్కొంది. ఈసీకి అందించిన ఆడిట్ నివేదికలో 2023-24లో మొత్తం రూ.1,225.11 కోట్ల విరాళాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇందులో గ్రాంట్లు, విరాళాలు విరాళాల ద్వారా వచ్చినవి రూ.1,129.67 కోట్లు ఉన్నాయని తెలిపింది. మార్చి 31, 2024తో ముగిసిన సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.828.36 కోట్లు ఇందులోనే ఉన్నాయని చెప్పింది. గతకొద్ది నెలల కింద సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను నిషేధించిన విషయం తెలిసిందే.
నివేదిక ప్రకారం.. ప్రకటనల కోసం కాషాయ పార్టీ రూ.591కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అగ్రభాగం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసమే రూ.434.84కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం రూ.115.62 కోట్లు ఉన్నాయి. 2023-24లో అధికార పార్టీ విమానాలు, హెలికాప్టర్ల కోసం రూ.174 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో ఆ పార్టీ రూ. 78.23 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 2023-24లో ప్రకటనల కోసం కాంగ్రెస్ రూ. 251.67 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనల కోసం రూ. 207.94 కోట్లు.. ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం రూ.43.73 కోట్లు వెచ్చించింది.
అదే సమయంలో విమానాలు, హెలికాప్టర్ల కోసం రూ.62.65 కోట్లు చెల్లించింది. 2023-24లో పార్టీ తన అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ.238.55 కోట్లు ఇచ్చింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రచార ఖర్చుల కోసం రూ.28.03 కోట్లు, సోషల్ మీడియా ఖర్చుల కోసం రూ.79.78 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో భారత్ జోడోయాత్ర-2 కోసం రూ.49.63 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ నివేదికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 2022-23లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగిన భారత్ జోడోయాత్ర మొదటి విడుదలో రూ.71.84 కోట్లు ఖర్చు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ISRO | ఇస్రో వందో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 15
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం..!