BJP | న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ భారీ ప్రణాళికలే వేస్తున్నది. ఈసారి 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోరాడటంతోపాటు ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తమవైపు తిప్పుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మంగళవారం బీజేపీ అత్యున్నత స్థాయి వ్యూహకర్తల సమావేశం జరిగింది. ప్రత్యేకంగా ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించటంపైనే ఎక్కువసేపు చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శులందరికీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏదో ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ పని అప్పగించారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ చైర్మన్‌గా పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను నియమించారు. ‘ఇతర పార్టీల్లోని సిట్టింగ్ ఎంపీలు, బలమైన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ చూసుకొంటుంది.
నియోజకవర్గంలో ఆ నేత బలాన్ని, ఎన్నికల్లో గెలువగలిగే శక్తిసామర్థ్యాలను బట్టి కమిటీ నిర్ణయాలు ఉంటాయి’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అభ్యర్థులు నేరుగా గెలువలేని చోట్ల ఇలాంటి అవకాశాలను చేరికల కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 160 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే 400 స్థానాలకుపైగా గెలిచి చరిత్ర సృష్టించాలని బలంగా నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. 1984లో ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాజీవ్‌గాంధీ నేతృత్వంలో లోక్‌సభలో 400కు పైగా స్థానాలు గెలిచింది. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డుపై కన్నేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను రాధామోహన్‌దాస్ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచార వ్యూహం బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించారు.