Revanth Reddy | న్యూఢిల్లీ, డిసెంబర్ 7: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సీఎం కేసీఆర్‌ది బీహార్ డీఎన్ఏ’ అంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తాజాగా ఖండించింది. కులం, ప్రాంతం పేరుతో దేశాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విభజించాలనుకుంటున్నారా? అని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మౌనం వహించటాన్ని ఆయన తప్పుబట్టారు. గురువారం ఆయన పార్లమెంట్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ, ‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు. అహంకారంతో మాట్లాడిన మాటలవి. ఈ వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి సభ్యులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వివాదాస్పద వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి బీహార్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని మరో కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కూడా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఓ టీవీ జర్నలిస్టుతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో బీహార్ జీన్స్ ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనది తెలంగాణ డీఎన్ఏగా రేవంత్‌రెడ్డి చెప్పారు. బీహార్ డీఎన్ఏ అయిన కేసీఆర్ కన్నా.. తెలంగాణ డీఎన్ఏ అయిన తాను సీఎం పదవికి బెస్ట్ చాయిస్.. అని అన్నారు. ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డీఎన్ఏ బీహార్ రాష్ర్టానిది. బీహార్‌లోని కుర్మీ సామాజికవర్గానికి చెందినవారు. వారి పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరానికి, అక్కడ్నుంచి తెలంగాణకు వలసవచ్చారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.