న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై లేదని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా సామాన్యులపై భారీగా గ్యాస్ ధరల భారాన్ని మోపింది. వంటగ్యాస్ ధర సిలిండర్‌కు రూ.60 చొప్పున పెరుగగా, వాణిజ్య గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.114.5 మేర పెరిగింది. ఉజ్వల లబ్ధిదారులు కాకుండా సబ్సిడీ రహిత ఎల్పీజీని వాడే సామాన్య గృహ వినియోగదారులు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ కోసం రూ. 913 వెచ్చించాల్సి ఉంటుంది. ఏడాది లోపలే ఎల్పీజీ ధరలు పెరగడం ఇది రెండో సారి.
పశ్చిమాసియాలో సైనిక ఘర్షణలు మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎల్పీజీ ధరలు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాజాగా పెరిగిన ధరలు మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చాయి. నిరుడు ఏప్రిల్‌లో ఎల్పీజీ ధరలను ప్రభుత్వం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంచింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో ఇప్పుడు రూ.1,883కి పెరిగింది. మార్చి 1న పెరిగిన రూ.28కి అదనంగా ఇప్పుడు రూ.114.5 ధర పెరిగింది. ఈ ఏడాదిలోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లు రూ.302.50 పెరిగాయి.
పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌లో ఇంధన నిల్వలు స్థిరంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరలను పెంచే ఆలోచనలేవీ ప్రస్తుతానికి లేవని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమురు సరఫరాకు, నౌకా మార్గాలకు అడ్డంకులు ఏర్పడిన వేళ ప్రభుత్వ వర్గాల నుంచి ఈ హామీ వచ్చింది.
భారత్‌లో పెట్రోలియం నిల్వలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, దీని వల్ల సరఫరాకు అవరోధం ఏర్పడిన దేశంలో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జలాల్లో నిలిచి ఉన్న రష్యన్ ముడి చమురు నౌకల నుంచి చమురును కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీలకు అమెరికా తాత్కాలికంగా 30 రోజుల వరకు అనుమతి ఇచ్చినందున రష్యా అంగీకరిస్తే ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమని వర్గాలు చెప్పాయి.